సెటిమెంటుతో కేసీఆర్ డ్రామాలు.. తెలంగాణను మళ్లీ ఏపీలో కలపడం సాధ్యమా ? : వైఎస్ షర్మిల
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. రోజుకో కొత్త డ్రామాతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ కాదు... బొందల తెలంగాణగా మార్చారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బడులు కంటే బార్లు ఎక్కువున్నాయని ఆరోపించారు.

తాగుబోతుల తెలంగాణగా మార్చారు..
రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ తాగుబోతుల తెలంగాణగా మార్చారని షర్మిల విమర్శించారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు, అప్పులు పాలై రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం బాగుపడింది తప్ప.. పేదలకు ఒరిగిందేమి లేదని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఆత్యహత్యల తెలంగాణ, అప్పుల తెలంగాణగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణను మళ్లీ ఏపీలో ఎలా కలుపుతారు ?
బీజేపీ, ఎంఐఎం పార్టీలు మతత్వం గురించి మాట్లాడుతుంటే.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తెలంగాణ సెంటిమెంటును వాడుకుంటున్నారని విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను మళ్లీ ఏపీలో ఎలా కలుపుతారు ? అది సాధ్యమేనా? అని నిలదీశారు. సెటిమెంటుతో ప్రజలను రెచ్చగొట్టేందుకు కేటీఆర్ విలీనం మాట్లలు మాట్లాడుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్‌కు కాలం చెల్లింది
రాష్ట్రంలో దళితులకు , రైతులకు, మహిళలకు గౌరవం ఎక్కడ ఉందని షర్మిల ప్రశ్నించారు. ఇలాంటి దుర్మార్గపు పాలనను ఎక్కడా చూడలేదన్నారు. 59 ఏళ్లు దాటిన రైతులకు బీమా ఎందుకు వర్తింపచేయట్లేదని నిలదీశారు. కౌలు రైతులను అసలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌కు కాలం చెల్లిందని దుయ్యబట్టారు.. కేసీఆర్ పాలనను బొంద పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications