తెలంగాణ సెంటిమెంట్‌తో కొట్టిన వైఎస్ షర్మిల
హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. బీఆర్ఎస్ పెద్దలపై విరుచుకుపడ్డారు. ఘాటు విమర్శలు చేశారు. ప్రత్యేకించి- బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. బీఆర్ఎస్‌ను బందిపోట్ల రాష్ట్ర సమితిగా అభివర్ణించారు. తెలంగాణ సెంటిమెంట్‌తో కొట్టారు. తండ్రి పేరు చెప్పుకొని పదవులను అనుభవిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ను షేర్ చేశారామె. తన రాజకీయ ఎదుగుదలను చూసి కేటీఆర్‌కు భయం పట్టుకుందని షర్మిల ఎద్దేవా చేశారు. తండ్రి పేరు చెప్పుకొని పదవులు అనుభవించేది కేటీఆర్ అయితే, తండ్రి చూపించిన సంక్షేమ పాలన కోసం ఒంటరి పోరు చేసింది తానేనని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం 3,800 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశానని చెప్పారు.

కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ స్థానిక బంది పోట్ల రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల అవినీతిపై పోరాటం సాగించానని షర్మిల అన్నారు. పోడు భూముల కోసం కొట్లాడానని, నిరుద్యోగుల కోసం అంతులేని పోరాటం చేశానని పేర్కొన్నారు. ఎన్నో ప్రజా ఉద్యమాలు తెలంగాణ ప్రజల కోసం తాము చేస్తే అధికారంలో ఉన్న చిన్న దొర కేసీఆర్ ఏం సాధించారంటూ నిలదీశారు.
కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోయి ఆరు నెలలు మేల్కొన్నట్టు- బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు నాలుగున్నర సంవత్సరాలు నిద్రపోయి ఎన్నికల ముందు ఆరు నెలలు మేలుకొని ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల ఆరునెలల ముందు హామీలన్నీ నెరవేరుస్తామని గప్పాలు కొడుతున్నారంటూ విమర్శించారు. ఇంత కాలం తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఏమైందని షర్మిల ప్రశ్నించారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం తలపెట్టి లక్షల ఎకరాలలో నీళ్లు పారించారని, రైతుల రుణమాఫీ చేశారని షర్మిల పునరుద్ఘాటించారు. పావలా వడ్డీకే మహిళలకు రుణాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ, 46 లక్షల పేదలకు ఇళ్లు, లక్షల ఎకరాల పోడు భూములు-అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చారని పేర్కొన్నారు. మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లను కల్పించారని చెప్పారు.

ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు వైఎస్సార్ అమలు చేస్తే కేసీఆర్ మాత్రం ఎన్నో రకాలుగా ప్రజలను మోసం చేశారంటూ ఆరోపించారు. రుణమాఫీ పేరుతో రైతులు, సున్నా వడ్డీకే రుణాల పేరుతో మహిళలను మోసం చేశాడని ధ్వజమెత్తారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం, మూడెకరాల భూమి, దళిత సీఎం, దళిత బంధు, 12 శాతం రిజర్వేషన్.. ఇలా ఎన్నో మోసాలు చేశారని షర్మిల విమర్శించారు.
పార్టీ పేరు నుంచి తెలంగాణ అనే పదాన్ని తీసి ఆత్మగౌరవాన్ని చంపేశారంటూ ధ్వజమెత్తారు. పార్టీ పేరులోనే తెలంగాణను పెట్టుకొని ఆత్మగౌరవంతో పోరాటం సాగిస్తోన్నది తాము మాత్రమేనని షర్మిల చెప్పారు. అధికార మదం తలకెక్కిన చిన్న దొర కేసీఆర్‌కు అన్నీ జోకులుగానే కనిపిస్తున్నాయని, ఎవరిది నమ్మకమో.. ఎవరు జోకర్లో త్వరలోనే బయటపడుతుందంటూ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications