ఆగస్టు నెల మొత్తం తిరుమలలో విశేష ఉత్సవాలు- తేదీలవారీగా వివరాలివీ..!!
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. 20 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచి ఉంటోన్నారు. సర్వ దర్శనం టోకెన్లు ఉన్న భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ఆదివారం 87,792 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 29,656 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు.
హుండీ ద్వారా 4.20 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. ఇక ఆగస్టులో స్వామివారి విశేష ఉత్సవాల సందర్భంగా భక్తుల తాకిడి మరింత పెరుగుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటోన్నారు. ఆగస్టులో శ్రీవారికి విశేష ఉత్సవాలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన జాబితాను విడుదల చేశారు.

ఆగస్టు 1వ తేదీన పౌర్ణమి గరుడ సేవతో ఈ ఉత్సవాలు ఆరంభమౌతాయి. పౌర్ణమి గరుడ సేవ సందర్భంగా ఉత్సవ మూర్తులను తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు. కన్నుల పండువగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 31వ తేదీన హయగ్రీవ జయంతి, తిరుమల శ్రీవారు శ్రీ విఖనసాచార్య స్వామి సన్నిధికి వేంచేపుతో ముగుస్తాయి.
ఆగస్టు 12వ తేదీన మతత్రయ ఏకాదశి ఉత్సవాలను సంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తారు టీటీడీ అధికారులు. ఆగస్టు 15వ తేదీన చక్రత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం, ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్షత్రం వేడుకలను షెడ్యూల్ చేశారు. టీటీడీ అడ్మినిస్ట్రేషన్ భవనం ప్రాంగణంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుతారు.
ఆగస్టు 21వ తేదీన గరుడ పంచమి. దీన్ని పురస్కరించుకుని శ్రీవారికి పంచమి గరుడ సేవను నిర్వహిస్తారు. 22వ తేదీన కల్కి జయంతి సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక సేవలను నిర్వహిస్తారు. 25వ తేదీన తరిగొండ వెంగమాంబ వర్ధంతి. అదే రోజున వరలక్ష్మీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తారు.
ఆగస్టు 26వ తేదీన తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ ఉంటుంది. 27 నుంచి 29వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలను జరుపుతారు. 30వ తేదీన విఖనస మహాముని జయంతి. అదే రోజున శ్రావణపౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుతారు. స్వామివారికి ప్రత్యేక సేవలను నిర్వహిస్తారు. 31వ తేదీన హయగ్రీవ జయంతి. తిరుమల శ్రీవారు శ్రీ విఖనసాచార్య స్వామి సన్నిధికి వేంచేపుతో ఈ విశేష ఉత్సవాలు ముగుస్తాయి.












Click it and Unblock the Notifications