ఆ రోజున తిరుమలలో కల్యాణోత్సవం, ఆర్జిత సేవలు రద్దు..!!
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొని ఉంది. ఆదివారం నాడు 78,389 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 23,466 మంది తలనీలాలను సమర్పించారు. ఏడు కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉంటోన్నారు. సర్వదర్శనం కింద స్వామివారి దర్శించుకోవాలనుకునే వారికి ఎనిమిది నుంచి 8 గంటల సమయం పట్టింది.
హుండీ ద్వారా 3.87 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది. భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోన్నారు.

18వ తేదీన శ్రీవారి వార్షిక పుష్పయాగ మహోత్సవానికి అంకురార్పణ కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 19వ తేదీన శ్రీవారి పుష్పయాగం ఉంటుంది. ఆ రోజున స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు.
శ్రీవారి ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం చేపడతారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవ మూర్తులను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి ఊరేగింపుగా తీసుకొస్తారు. అక్కడ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు టీటీడీ అర్చకులు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు.. ఇతర సుగంధద్రవ్యాలతో అభిషేకిస్తారు.
మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ రోజున కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం ఆర్జితసేవలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications