తిరుమల శ్రీవారి అన్నప్రసాదంపై తెలుగుదేశం దుష్ప్రచారం
TTD Annaprasadam: శ్రీవారి అన్నప్రసాదంలో నాణ్యత లోపించిందంటూ తెలుగుదేశం పార్టీ చేస్తోన్న దుష్ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. భక్తులకు అత్యున్నత ప్రమాణాలతో అన్నప్రసాదాలను అందిస్తున్నామని, దీనిపై ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని అన్నారు.
శ్రీవారి అన్నప్రసాదం సరిగ్గా ఉడకలేదంటూ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న ఓ వీడియో క్లిప్‌ను తెలుగుదేశం పార్టీ తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఇందులో కూడా వైఎస్ఆర్సీపీ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించింది. తిరుమలకు వచ్చే భక్తులకు నాసిరకం భోజనాన్ని వడ్డిస్తోందని ఆరోపించింది.

దీనిపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు టీటీడీ అత్యున్నత ప్రమాణాలతో అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంలో టీటీడీ ప్రథమ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో బియ్యం సరిగా ఉడకలేదని కొందరు భక్తులు ఆందోళన చేశారనేది దుష్ప్రచారమేనని వ్యాఖ్యానించారు.
దాదాపు 700 మంది ఉన్న వెంగమాంబ అన్నప్రసాద హాల్‌లో 15 మంది మాత్రం.. భోజనం చేస్తున్న మిగిలిన భక్తులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం పలు అనుమానాలు కలిగిస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు టీటీడీపై చిన్న ఫిర్యాదు కూడా లేకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు చెప్పారు.
సాదారణంగా ఒక్కొక్కరి ఆహారపు అలవాట్లు ఒక్కో విధంగా ఉంటుందని భూమన అన్నారు. స్వామివారి దగ్గర ప్రతి ఒక్కరు సంయమనంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. అన్నప్రసాదంలో ఏదైన పొరపాట్లు జరిగి ఉంటే తాము దానిని సరిదిద్దుకుంటామని, అంతేగానీ లేనిపోని దుష్ప్రచారం చేస్తే భగవంతుడు క్షమించడని అన్నారు.












Click it and Unblock the Notifications