ఈ మూడు జిల్లాల్లో వైఎస్ జగన్ సుడిగాలి పర్యటన
తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో పండగ వాతావరణం నెలకొంది. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారిని దర్శించడానికి వచ్చే భక్తుల తాకిడి మొదలైంది. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తిరుమలకు చేరుకుంటోన్నారు. నడక మార్గాలన్నీ రద్దీగా మారుతున్నాయి.
శనివారం 66,590 మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 31,052 మంది తలనీలాలను సమర్పించారు. టీటీడీకి హుండీ ద్వారా 3.37 కోట్ల రూపాయల ఆదాయం అందింది. తొమ్మిది కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచి ఉంటోన్నారు. సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు స్వామివారి దర్శనానికి 16 నుంచి 12 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చకులు, టీటీడీ అధికారులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. ఈ నెల 28వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి.
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ సాయంత్రం తిరుమలను సందర్శించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలనను సమర్పించనున్నారు. ఈ సందర్భంగా తిరుపతిలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. తిరుపతితో పాటు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. సాయంత్రానికి తిరుపతి చేరుకుంటారు. ముందుగా శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తారు. అదే సభలో- ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ భవనాన్ని వర్చువల్ ప్రారంభిస్తారు జగన్. అనంతరం టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తారు.
అక్కడి నుంచి తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి బయలుదేరి వెళ్తారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం తిరుమలకు చేరుకుంటారు. కొత్తగా నిర్మించిన వకుళామాత రెస్ట్ హౌస్, రచన రెస్ట్ హౌస్‌లు ప్రారంభిస్తారు. బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని అక్కడి నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ప్రధాన ఆలయానికి చేరుకుంటారు.
స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించిన అనంతరం వైఎస్ జగన్ వాహన మండపానికి చేరుకుంటారు. పెద శేష వాహన సేవలో పాల్గొంటారు. రాత్రి పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. మంగళవారం తెల్లవారు జామున ఉదయం 6:20 నిమిషాలకు శ్రీవారిని దర్శించుకుంటారు.
అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి వచ్చి ప్రత్యేక విమానంలో కర్నూలు జిల్లాకు బయలుదేరి వెళ్తారు. కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయానికి అక్కడి నుంచి జిల్లాలోని కృష్ణగిరి మండలం లక్కసాగరం చేరుకుంటారు. డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాలకు మంచినీరు, సాగునీటిని సరఫరా చేసే పథకాలను ప్రారంభిస్తారు. డోన్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications