Cyclone Michaung: శ్రీవారి భక్తులకు టీటీడీ అత్యవసర సూచనలు జారీ
పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతున్న ఈ తుఫాన్- ఈ ఉదయం 11:30 గంటల సమయానికి చెన్నైకి 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. నెల్లూరుకు 140, బాపట్లకు 140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ నెల 5వ తేదీన నెల్లూరు- మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది.

ప్రస్తుతం గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది మిఛౌంగ్ తుఫాన్. తీరానికి సమీపిస్తోన్న కొద్దీ తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, తమిళనాడు ఉత్తర ప్రాంత జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన ఈదురుగాలులు వణికిస్తాయి. ఇప్పటికే ఏపీ, తమిళనాడుల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి.
తుఫాన్ ప్రభావం వల్ల తిరుపతిలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తోన్నాయి. రెండు రోజులుగా ఎకధాటిగా దంచికొడుతున్నాయి. తెరిపి ఇవ్వట్లేదు. అటు తిరుమలలో కుండపోతగా వర్షం పడుతోంది. శ్రీవారి భక్తులు ఇక్కట్లకు గురవుతున్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల వల్ల తిరుమలలోని మాల్వాడి గుండం జలకళను సంతరించుకుంది. ఉప్పొంగి ప్రవహిస్తోంది. కపిలతీర్థం జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కీలక సూచనలు జారీ చేశారు.

కపిలతీర్థం పుష్కరిణిలో పుణ్యస్నానాలను ఆచరించడాన్ని నిలిపివేసినట్లు టీటీడీ అధికారులు చెప్పారు. కార్తీక మాసం కావడం వల్ల పుణ్యస్నానాలను ఆచరించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో కపిల తీర్థానికి వెళ్తోన్న విషయం తెలిసిందే. సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకూ పుష్కరిణిలో దిగకూడదని, భక్తుల అనుమతిని తాత్కాలికంగా నిలిపివేశామని వివరించారు..












Click it and Unblock the Notifications