Chandrayaan 3: కీలక ప్రకటన చేసిన ఇస్రో ఛైర్మన్
తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మరో అత్యాధునిక ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించింది. ఈ ఉదయం సరిగ్గా 10:42 నిమిషాలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి దూసుకెళ్లింది ఈ రాకెట్. జియో సింక్రనైజ్డ్ లాంచింగ్ వెహికల్- ఎఫ్12, ఎన్‌వీఎస్-1ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
ఈ ప్రయోగం పూర్తయిన అనంతరం ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ విలేకరులతో మాట్లాడారు. చంద్రయాన్ 3 మిషన్ గురించి వివరాలను తెలియజేశారు. చంద్రుడిపై మరిన్ని పరిశోధనలను సాగించడానికి ఈ మిషన్‌ను చేపట్టామని, దీన్ని జులైలో ప్రయోగించబోతోన్నట్లు వెల్లడించారు. జులై 12వ తేదీన ఈ స్పేస్ క్రాఫ్ట్‌ను ప్రయోగించే అవకాశాలను పరిశీలిస్తోన్నామని స్పష్టం చేశారు.

చంద్రయాన్ రోవర్‌ను ఆగస్టు 23వ తేదీన చంద్రుడిపై ల్యాండ్ అయ్యేలా ప్రణాళికలను వేసుకున్నామని, అన్నీ సవ్యంగా సాగుతాయని ఆశిస్తున్నట్లు సోమనాథ్ పేర్కొన్నారు. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ చేయాలనేదే తమ ప్రయత్నమని వివరించారు. జియోసింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ మార్క్-3 ద్వారా రోవర్‌ను చంద్రుడిపైకి పంపిస్తామని అన్నారు.
గతంలో చేపట్టిన చంద్రయాన్ 2 విఫలమైన విషయం తెలిసిందే. ఇందులో భాగమైన విక్రమ్ ల్యాండర్.. చంద్రుడిపై అడుగు పెట్టలేకపోయింది. చిట్ట చివరి నిమిషంలో గతి తప్పింది. 2019 సెప్టెంబర్ 7వ తేదీన అర్ధరాత్రి దాటిన తరువాత 1:30 నుంచి 2:30 గంటల మధ్యలో చంద్రుడిపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు స్తంభించిపోయాయి. ఆ తరువాత అది క్రాష్ ల్యాండ్ అయింది. ఉత్తర ధృవం వైపు కూలింది.
ఇప్పుడు తాజాగా చంద్రయాన్ 3 మిషన్ ను చేపట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. ల్యాండర్‌ను చంద్రుడిపైకి మోసుకెళ్లడానికి అవసరమైన లాంచింగ్ వెహికల్ క్రయోజనిక్ ఇంజిన్ సీ-20ని విజయవంతంగా పరీక్షించారు. 25 నిమిషాల పాటు దాన్ని మండించారు. తమిళనాడులోని మహేంద్రగిరిలో గల ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లోని హై ఆల్టిట్యూడ్ టెస్ట్ ఫెసిలిటీ సెంటర్ లో టెస్ట్ ఫైర్ ఇదివరకే పూర్తయింది.
చంద్రుడి ఉపరితలంపై దిగాల్సిన ల్యాండర్‌కు సంబంధించిన ఎలక్ట్రో మేగ్నటిక్ ఇంటర్‌ఫెరెన్స్/ఎలక్ట్రో మేగ్నటిక్ కాంపాటిబిలిటీ పరీక్షలను బెంగళూరు పీణ్యాలోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో విజయవంతంగా నిర్వహించారు. రేడియో ఫ్రీక్వెన్సీ సిస్టమ్, ఆటో కాంపాబిలిటీ టెస్ట్, యాంటెన్నా పోలరైజేషన్, ల్యాండర్, దానికి అమర్చిన రోవర్ ను పరీక్షించారు. అవన్నీ సక్రమంగా ఉన్నట్లు నిర్ధారించారు.
చంద్రుడి కక్ష్య నుంచి భూమి స్పెక్ట్రల్- పోలారిమెట్రిక్ కొలతలను అధ్యయనం చేయడానికి స్పెక్ట్రో-పోలరిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (షేప్) పేలోడ్‌ను ఈ రాకెట్‌తో పాటు పంపిస్తారు. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్, ఆల్ఫా పార్టికల్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్, లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పోక్ట్రోస్కోపీ.. వంటివి ఈ రాకెట్ పేలోడ్స్.












Click it and Unblock the Notifications