వైసీపీ ఎంపీ ప్రమాణ స్వీకారం..ఆయనతోనే ఆరంభం
న్యూఢిల్లీ: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి లోక్‌సభ సభ్యుడు ఫిజీషియన్ డాక్టర్ ఎం గురుమూర్తి.. ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 18వ తేదీన నిర్వహించిన తిరుపతి లోక్‌సభకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఆయన పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పనబాక లక్ష్మిని ఓడించారు. తొలిసారిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన గురుమూర్తి.. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు కొనసాగి, కేంద్ర మంత్రిగా పనిచేసిన పనబాక లక్ష్మిపై రెండున్నర లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓడించడం సంచలనం సృష్టించారు. జెయింట్ కిల్లర్‌గా గుర్తింపు పొందారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కొద్దిసేపటి కిందటే గురుమూర్తి లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ ఓం బిర్లా ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమం ఆయనతోనే ఆరంభమైంది. లోక్‌సభ ఉప ఎన్నికలను ఎదుర్కొన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మొదటి స్థానంలో ఉండటంతో డాక్టర్ గురుమూర్తితో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ప్రారంభమైంది. దైవసాక్షిగా గురుమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే వైసీపీ సభ్యులు ఆయనను అభినందించారు.

ఇదే తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ డిపాజిట్‌ను కోల్పోయింది. బీజేపీ తరఫున చిత్తూరు జిల్లాకే చెందిన పదవీ విరమణ చేసిన ఐఎఎస్ అధికారిణి రత్నప్రభ పోటీ చేశారు. జనసేన పార్టీ మద్దతు ప్రకటించినా.. ఆమె తరఫున స్వయానా పవన్ కల్యాణ్ ప్రచారం చేసినా.. గెలవలేకపోయారు. డాక్టర్ గురుమూర్తికి 6,26,108 ఓట్ల పోల్ అయ్యాయి. టీడీపీ అభ్యర్థిని పనబాక లక్ష్మికి 3,54,516 ఓట్ల రాగా.. బీజేపీ నుంచి పోటీ చేసిన కే రత్నప్రభకు వచ్చిన ఓట్లు 57 వేలే.
కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ చింతా మోహన్ బరిలోకి దిగినా.. కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. ఆయనకు 10 వేల లోపు ఓట్లే పడ్డాయి. వైసీపీకి చెందిన తిరుపతి లోక్‌సభ సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూయడంతో ఈ ఉప ఎన్నికలను నిర్వహించాల్సి వచ్చింది. బల్లి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో డాక్టర్ ఎం గురుమూర్తిని ఎంపిక చేసింది వైసీపీ అధిష్ఠానం. భారీ మెజారిటీతో ఆయనను గెలిపించుకోగలిగింది.












Click it and Unblock the Notifications