టీటీడీ పాలక మండలి చివరి భేటీ- అక్కడ కొత్త వైకుంఠం క్యూ కాంప్లెక్స్, సొంతంగా నెయ్యి తయారీ
తిరుపతి: ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుత పాలక మండలి చివరి సమావేశం ముగిసింది. ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సారథ్యంలో ఏర్పాటైన ఈ భేటీలో సభ్యులు పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.. తీర్మానాలను ఆమోదించారు. శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే కోట్లాది మంది భక్తుల కోసం తిరుమలలో మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకుని రానున్నారు.
అలిపిరి కాలిబాట మార్గంలో..: నాలుగు కోట్ల రూపాయలతో అలిపిరి కాలిబాట మార్గంలోని మొదటి ఘాట్ రోడ్డులో మోకాలిమెట్టు నుంచి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం వరకు మిగిలి ఉన్న ప్రదేశంలో ఫుట్‌పాత్ షెల్టర్లను నిర్మించాలని టీటీడీ ట్రస్టుబోర్డు సభ్యులు తీర్మానించారు. విద్యుత్ బస్సుల కోసం తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డులో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికోసం 2.20 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు.

పీఏసీ- 1 లో..: తిరుమలలో యాత్రీకుల సహాయక కేంద్రం- 1లో రెండున్నర కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులను చేపట్టడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలపై బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారు. అలాగే- 24 కోట్ల రూపాయలతో రెండు ఘాట్ రోడ్లలో కూడా రక్షణ గోడలను నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తిరుచానూరులో వైకుంఠం క్యూ కాంప్లెక్స్..: శ్రీవారి ప్రసాదాలు, అన్నప్రసాదం తయారీకి వినియోగించే వంట సరుకులను మరింత నాణ్యత ఉండేలా అత్యాధునిక యంత్ర పరికరాలు కొనుగోలు చేయాలని తీర్మానించారు. దీనికోసం 4.5 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో భక్తులు వేచి ఉండటానికి వీలుగా తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తరహాలో 23.50 కోట్లతో యాత్రికుల వసతి భవనం నిర్మాణానికి ఆమోదం తెలిపారు.
పద్మావతి ఆసుపత్రిలో..: త్వరలో అందుబాటులోకి రానున్న శ్రీపద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి అవసరమైన స్పెషలిస్టు డాక్టర్లు, డ్యూటీ డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది నియామకానికి అనుమతి ఇచ్చారు. అదేవిధంగా 75.86 కోట్ల రూపాయలతో అత్యాధునిక వైద్య పరికరాల కొనుగోలు చేయడానికి పచ్చజెండా ఊపారు.

సబ్ వే నిర్మాణం..: తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్‌లో భక్తుల సదుపాయం కోసం మూడు కోట్ల రూపాయల వ్యయంతో సబ్‌వే నిర్మాణంతో పాటు, శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పార్కింగ్ వసతి, మినీ కల్యాణకట్ట, ఫెసిలిటీ సెంటర్ తదితర అభివృద్ధి పనులను 3.5 కోట్ల రూపాయలతో చేపట్టనున్నారు.
వకుళ మాత ఆలయాభివృద్ధికి..: 9.85 కోట్ల రూపాయలతో శ్రీవాణి ట్రస్ట్ నిధులతో వకుళ మాత ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి కార్యక్రమాలును చేపట్టనున్నారు. భక్తులకు మరిన్ని వసతి సౌకర్యాలను అక్కడ కల్పించనున్నారు. తిరుపతిలో నిర్మితమౌతోన్న శ్రీనివాస సేతుకు చివరి విడతగా 118.83 కోట్ల రూపాయలను టీటీడీ పాలక మండలి సభ్యులు మంజూరు చేశారు. నిర్మాణ పనులు పూర్తికాగానే ఈ మొత్తాన్ని చెల్లిస్తారు.
సొంతంగా నెయ్యి తయారీ: తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో అభివృద్ధి పనులకు మరో అయిదు కోట్ల రూపాయలను మంజూరు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కైంకర్యాలకు వినియోగించడానికి ఎస్వీ గోసంరక్షణశాలలో 4.25 కోట్ల రూపాయలతో సంప్రదాయ పద్ధతిలో నెయ్యి తయారీ ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
అదనపు అంతస్తులు..: ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రిలో 11.50 కోట్ల రూపాయలతో అదనపు అంతస్తు నిర్మాణం, 2.60 కోట్ల రూపాయలతో గ్రౌండ్ ఫ్లోర్ అభివృద్ధి పనులు, మూడు కోట్ల రూపాయలతో ఆయుర్వేద కళాశాల విద్యార్థినుల హాస్టల్ భవనంలో అదనంగా మరో రెండు అంతస్తుల నిర్మాణానికి సభ్యలు ఆమోదం తెలిపారు.
ఆ ఆలయాల జీర్ణోద్ధారణ..: 2.20 కోట్ల రూపాయలతో తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో కొత్తగా టీబీసీడీ వార్డును నిర్మించనున్నారు. ఎస్వీ సంగీత కళాశాల, ఎస్వీ నాదస్వర పాఠశాలలో చదువుతున్న బాలురకు హాస్టల్ భవనం నిర్మాణానికి 11 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. 1.65 కోట్ల శ్రీవాణి నిధులతో తిరుపతిలోని పల్లెవీధిలో వెలసిన వేశాలమ్మ దేవస్థానం, శ్రీతాళ్ళపాక పెద్ద గంగమ్మ ఆలయాన్ని జీర్ణోద్ధరించనున్నారు.

గరిమెళ్ల పదవీ కాలం పొడిగింపు..:1.25 కోట్ల రూపాయల వ్యయంతో దేశవ్యాప్తంగా ఉన్న రక్షణ లేని 69 టీటీడీ భూములకు కంచెను వేయాలని పాలక మండలి సభ్యులు తీర్మానించారు. టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ పదవీ కాలాన్ని మరో మూడేళ్ల పాటు పొడిగించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీవాణి నిధులతో 26 ఆలయాల అభివృద్ధి ప్రతిపాదనలను ఆమోదించారు.












Click it and Unblock the Notifications