అప్పుడే ‘గౌరవనీయులైన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారూ’ అని పిలుస్తా: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: మనమెప్పుడూ నమ్ముకున్న ఆశయం కోసం పోరాడాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం తిరుపతిలో జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఓటు అనేది ఆయుధమని.. అమ్మేసుకుంటామా? భయపడి లొంగిపోతామా? అనేది మనమే నిర్ణయించుకోవాలని ప్రజలకు సూచించారు పవన్ కళ్యాణ్.

151 ఎమ్మెల్యేలున్నా భయపడతారు
తాను ఎన్నికల్లో ఓడిపోయాను కానీ.. నిలబడే ఉన్నానని.. నమ్ముకున్న ఆశయం కోసం పోరాటం కొనసాగిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. మనం నమ్ముకున్న ఆశయం కోసం పోరాడితే 151 మంది ఎమ్మెల్యేలున్నా భయపడుతుందని అన్నారు. ధైర్యమే తన ఖడ్గమని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రభుత్వ తప్పిదాలపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

అప్పుడే పిలుస్తా..
గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని అనడం లేదని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని.. రైతులకు ఇబ్బందికర పరిస్థితి లేనప్పుడు... జనసైనికుల బత్తాయి తోటలను నరకకుండా ఉన్నప్పుడు.. ఓట్ల కోసం పథకాలను తేనప్పుడు.. ఓట్ల కోసం వర్గాలుగా విభజించనప్పుడు.. అప్పుడు గౌరవిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు.
అప్పటి వరకు తాను జగన్ రెడ్డి అనే పిలుస్తానని అన్నారు.

పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పాలా?
రైల్వేకోడూరులో గిట్టుబాటు ధర లేక రైతులు చనిపోతున్నారని.. ఆ విషయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చి జగన్ సర్కారుకు చెప్పాలా? అని ప్రశ్నించారు. ప్రజలు దయనీయ స్థితిలోనే ఉండాలని పాలకులు కోరుకుంటున్నారని అన్నారు. జనసేన దగ్గరకు వస్తే కోర్టుకు వచ్చినట్లుండాలని అన్నారు. కోర్టులు ధర్మానని నిలబెడతాయన్నారు.

ప్రజలు కోరుకుంటే..
తిరుపతి నుంచి ధర్మో రక్షతి రక్షిత: అనేది తాను నేర్చుకున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. తాను మాట్లాడే మాటలు బాధ పెడతాయి కావొచ్చు కానీ.. సమస్యను పరిష్కరించేలా చేస్తాయన్నారు పవన్ కళ్యాణ్. ఓట్లు రావేమోనని తాను భయపడనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటే వస్తుందని.. వారు కోరుకున్నప్పుడే సీఎం అవుతానని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీది రంగుల రాజ్యమని ఆయన మండిపడ్డారు.












Click it and Unblock the Notifications