తిరుమలలో ప్రభాస్: కమ్మేసిన ఆదిపురుష్ మేనియా- కాషాయమయం
తిరుపతి: మచ్ అవైటెడ్ మూవీ- ఆదిపురుష్. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ఇది. ఈ నెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అభిమానులను పలకరించబోతోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. హై బడ్జెట్ మూవీ కావడం వల్ల దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నారు.
శ్రీరామచంద్రమూర్తిగా ప్రభాస్, సీతమ్మగా కృతి సనన్ నటించారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్- రావణుడి పాత్రను పోషించారు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నగే నటించారు. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో చిత్రీకరణ జరుపుకొన్న ఈ సినిమాను టీ- సిరీస్ నిర్మించింది. ఓం రౌత్ దర్శకుడు. రామాయణం ఆధారంగా తెరకెక్కడం వల్ల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఆధ్యాత్మిక నగరి తిరుపతిని ఎంచుకుంది యూనిట్.

మంగళవారం సాయంత్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్టేడియం దీనికి వేదిక. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రభాస్ ఈ రాత్రికి తిరుపతికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యారు. అనంతరం నేరుగా తిరుమలకు బయలుదేరి వెళ్లారు. తెల్లవారు జామున తిరుమలలో శ్రీవారి దర్శించుకుంటారు. స్వామివారి సేవల్లో పాల్గొంటారు.
అనంతరం శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీకి చేరుకుంటారు. అక్కడ విద్యార్థులతో ముఖాముఖి పాల్గొంటారని తెలుస్తోంది. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొంటారు ప్రభాస్. దీనికి ముఖ్య అతిథిగా త్రిదండి చిన జీయర్ స్వామి హాజరుకావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వంద మంది చొప్పున గాయకులు, కళాకారులు ప్రదర్శన ఇవ్వబోతోన్నారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసమే చిత్రం యూనిట్ రెండున్నర కోట్ల రూపాయలను వ్యయం చేసింది. 50 లక్షల రూపాయల విలువ చేసే బాణాసంచాను సిద్ధం చేసింది. తిరుపతిలో ఆదిపురుష్ మేనియా కమ్ముకుంది. ఎటు చూసినా ప్రభాస్ బ్యానర్లు, పోస్టర్లు, కటౌట్లు కనిపిస్తోన్నాయి. రామబాణాన్ని ఎక్కు పెట్టిన శ్రీరాముడి గెటప్‌లో ఉన్న నిలువెత్తు కటౌట్లను ఏర్పాటు చేశారు అభిమానులు.

శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీ స్టేడియానికి దారి తీసే మార్గాల్లో కాషాయ జెండాలను కట్టారు. భారీ బెలూన్లను ఏర్పాటు చేశారు. వాటన్నింటిపైనా ఆదిపురుష్ ప్రభాస్ ఫొటోలను ముద్రించారు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నారు. తిరుపతి తరువాత హైదరాబాద్, ముంబై, చెన్నై, న్యూఢిల్లీల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లను నిర్వహించాలని ప్లాన్ చేసింది యూనిట్.












Click it and Unblock the Notifications