తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్య పెంపు: టీటీడీ, 23 నుంచి విడుదల, మార్చిలో 25వేలకు
తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. శ్రీవారి భక్తుల కోసం దర్శన టికెట్ల సంఖ్యను పెంచుతూ
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణంయం తీసుకుంది. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 28 వరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్లను రేపు విడుదల చేస్తున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఫిబ్రవరి 24 నుంచి అదనపు కోటా కింద 13వేల దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఇక మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రోజుకు 25వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ఉదయం 9 గంటలకు రూ. 300 ప్రత్యక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

మార్చి నెలకు సంబంధించి సర్వదర్శన టికెట్లను రోజుకు 20వేలకు పెంచిన టీటీడీ.. నిత్యం 5వేల చొప్పున అదనపు కోటా కింద జారీ చేయనుంది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీగోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో టికెట్లను జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది.
ధ్వజారోహణంతో శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం 6.30 గంటల నుంచి ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. కోవిడ్ - 19 నిబంధనల మేరకు ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహిస్తారు.
అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కంధమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ వినాయక స్వామి, శ్రీ చండికేశ్వరస్వామి, శ్రీ వల్లి, దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామివారి ఉత్సవమూర్తుల సమక్షంలో ఉదయం 8.10 గంటలకు మీన లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు. ఆలయ ప్రధానార్చకులు మణిస్వామి కంకణభట్టర్‌గా వ్యవహరించారు.
ధ్వజస్తంభానికి విశేష అభిషేకం
ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, ఆ తరువాత ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు. ఏడాదికోసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారు. పెరుగు, చందనం, విభూది, పన్నీరు, పలురకాల పండ్లతో వేడుకగా ధ్వజస్తంభానికి అభిషేకం జరిగింది. దీపారాధనలో భాగంగా రథహారతి, నక్షత్రహారతి, సద్యజాతాది దీపారాధన, కుంభహారతి ఇచ్చారు. ఆ తరువాత ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. అదేవిధంగా రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాల్లోని మంత్రాలను పఠించారు.
కోవిడ్ నిబంధనల మేరకు ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు
ఈ సందర్భంగా జెఈవో వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ.. ధ్వజారోహణంతో శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయన్నారు. కోవిడ్ నిబంధనల మేరకు ఫిబ్రవరి 22 నుండి మార్చి 3వ తేదీ వరకు ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు.
Recommended Video
అనంతరం శ్రీ కపిలేశ్వరస్వామివారికి, శ్రీ కామాక్షి అమ్మవారికి ఆలయంలో పల్లకీ ఉత్సవం నిర్వహించారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామి, అమ్మవార్లు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో సుబ్రమణ్యం, ఏఈవో సత్రేనాయక్, సూపరింటెండెంట్ భూపతి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications