శ్రీవారి భక్తులకు అలర్ట్: తిరుమల కొండల్లో చిరుతలు-ఈ ప్రాంతాల్లో గుర్తింపు
తిరుపతి: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు వెలిసిన తిరుమల శేషాచలం అడవుల్లో చిరుతలు, ఇతర వణ్య ప్రాణుల సంఖ్య భారీగా పెరిగింది. 48 గంటల వ్యవధిలో శేషాచలం అడవుల్లో అయిదు వేర్వేరు ప్రాంతాల్లో చిరుతలు కనిపించాయి. వాటిని టీటీడీ అటవీ శాఖ అధికారులు సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఎలుగుబంట్లు, ఇతర వణ్యప్రాణుల సంచారం కూడా రెట్టింపైందనే నిర్ధారణకు వచ్చారు.
దీన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. చిరుతలు, ఇతర వణ్యప్రాణుల నుంచి శ్రీవారి భక్తులకు ఎలాంటి ప్రమాదం సంభవించకూడదనే ఉద్దేశంతోనే ఆంక్షలను విధించారు. శ్రీవారి మెట్టు, అలిపిరి మెట్ల మార్గంలో కంచె వేయాలని నిర్ణయించారు. భక్తులు ఒంటరిగా వెళ్లకుండా తక్షణ చర్యలను తీసుకున్నారు.

అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్తోన్న నెల్లూరుకు చెందిన ఆరేళ్ల బాలిక లక్షితపై చిరుత దాడి చేసి చంపిన ఉదంతం అనంతరం టీటీడీ అటవీ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. చిరుతల సంచారంపై దృష్టి సారించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా వాటి కదలికపై నిఘా ఉంచారు. లక్షితపై దాడి చేసిన మరుసటి రోజే అంటే శనివారం ఒక్కరోజే ఆరు ప్రాంతాల్లో చిరుతలు కనిపించినట్లు నిర్ధారించారు.
అలిపిరి నుంచి గాలిగోపురం, శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, 38వ మలుపు ప్రాంతాలతో పాటు మొత్తం అయిదు చోట్ల చిరుతల సంచారాన్ని గుర్తించారు. వాటి కదలికలను పసిగట్టడానికి అలిపిరి మార్గంలో గాలి గోపురం చి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు సుమారు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

మెట్ల మార్గంతో పాటు ఘాట్ సెక్షన్, రోడ్డుకు ఆనుకుని ఉండే అటవీ ప్రాంతాల్లో వాటిని అమర్చనున్నారు. అలిపిరి ఘాట్ ఆరంభం నుంచి తిరుమలకు చేరుకునేంత వరకు కాలిబాటలకు ఇరు వైపులా ఫెన్సింగ్ వేయనున్నారు. దీనికోసం సుమారు ఆరు కోట్ల రూపాయలను వ్యయం చేయాలని నిర్ణయించారు. త్వరలోనే దీనికి సంబంధించిన పనులను మొదలుపెట్టనున్నారు.












Click it and Unblock the Notifications