తిరుమలలో పండగే, భక్తులకు ఫుల్ హ్యాపీ, ఎన్ని వేల టన్నులు !
తిరుమల/తిరుపతి: తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో స్వర్ణకాంతులు విరజిమ్మేలా ఏర్పాటు చేసిన అష్టలక్ష్మీ, దశావతార మండపంలో శనివారం శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు అధికారికంగా శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. మే 1వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు జరుగనున్నాయి.
శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో మొదటిరోజు అంటే వైశాఖశుద్ధ నవమిరోజైన శనివారం శ్రీమలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా, ఉభయనాంచారులు పల్లకిపై పరిణయోత్సవ మండపానికి సాయంత్రం 5. 30 గంటలకు వేంచేపు చేశారు. ఆ సందకర్బంలో శ్రీవారి భక్తులు పులకించిపోయారు.

శోభాయమానంగా తీర్చిదిద్దిన పెండ్లిమండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీస్వామివారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవటం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. ఆ తరువాత స్వామివారికి కొలువు (ఆస్థానం) జరిగింది. ఈ కొలువులో సర్వజగత్ప్రభువైన శ్రీవేంకటేశ్వరస్వామి వారికి వేదాలు, పురాణాలు, సంగీతరాగాలు, కవితలు, నృత్యాలు నివేదించారు.
మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సహితుడైన స్వామి బంగారుతిరుచ్చిపై అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో తొలిరోజు వివాహ వేడుక ఘనంగా ముగిసింది.
వేలాది మంది భక్తు ఈ వేడుకులు చూసి పులకించిపోయారు.
శ్రీ పద్మావతి పరిణయ మండపాన్ని ఆపిల్, ఫైనాపిల్, మొక్కజొన్న కంకులు, ఆస్ట్రేలియా ఆరంజ్, నారింజ, ద్రాక్ష, అరటి, మామిడి కొమ్మలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. మండపం అలంకరణకు బంతి, చామంతి, వట్టివేరు, వాడామల్లి, నాలుగు రంగుల రోజాలు, కార్నస్ తదితర పుష్పాలను వినియోగించారు.

తిరుమలలో 1.5 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 30 వేల కట్ ఫ్లవర్లు ఉపయోగించారు. మధ్యమధ్యలో క్రిస్టల్ బాల్స్, షాండ్లియర్లు వేలాడదీశారు. చిన్ని కృష్ణుడు, వెన్న కుండలు, ఎనుగులు, నెమళ్ళు సెట్టింగ్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మండప అలంకరణకు పుణెకి చెందిన శ్రీ వేంకటేశ్వర ఛారిటబుల్ ట్రస్టు 24 లక్షలు టీటీడీకి విరాళం అందించింది. 15 రోజులుగా 30 మంది చెన్నైకి చెందిన నిపుణులు, రెండు రోజులుగా 100 మంది టీటీడీ గార్డెన్ సిబ్బంది ఈ ప్రాంగణాన్నిఅత్యంత మనోహరంగా అలంకరించారు.












Click it and Unblock the Notifications