Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటలు..!
కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా ఉంది. శని, ఆది, సోమవారాలు సెలవులు కావడంతో భక్తులు భారీగా తరలొచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. దాదాపు అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. భక్తులు టైమ్ స్లాట్ ఎస్ఎస్డీ దర్శనం కోసం 12 కంపార్ట్ మెంట్లలో వేచి చూస్తున్నారు.
భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఎండకాలం కావడంతో భక్తులకు తాగు నీరు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. భక్తులకు ఆహారం కూడా అందిస్తున్నట్లు వివరించారు. వరుస సెలువులు రావడంతో భక్తుల రద్దీ పెరిగినట్లు పేర్కొన్నారు. కాగా ఆదివారం రోజు శ్రీవారిని 80,532 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 29,438 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఆదివారం స్వామివారి హుండీ ఆదాయం రూ.3.95 కోట్లుగా ఉంది.

తిరుమలలో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు నిన్నటితో ముగిశాయి. చివరి రోజైన ఆదివారం శ్రీ మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా తెప్పపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకెళ్లారు. రాత్రి 7 గంటలకు విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీభూ సమేతంగా శ్రీమలయప్పస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఏడు చుట్లు విహరించి భక్తులకు కనివిందు చేశారు.
మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, ఎస్ ఇ -2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా ఈరోజు టీటీడీ ఆధ్వర్యంలో రెండు విశేష ఉత్సవాలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications