ఆన్‌లైన్‌లో టీటీడీ టికెట్లు- లింక్ ఇదే
TTD: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 16వ తేదీ నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు కొనసాగుతాయి. 18వ తేదీన పూర్ణాహుతితో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తోన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.
ఈ పవిత్రోత్సవాలకు ఈ నెల 15వ తేదీ సాయంత్రం అంకురార్పణ చేస్తారు తిరుచానూరు ఆలయ అర్చకులు. ఇందులో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవాలను చేపడతారు. అలాగే- 16వ తేదీన పవిత్ర ప్రతిష్ఠ, 17న పవిత్ర సమర్పణ, 18న పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయి.

ఆలయానికి వచ్చే భక్తులు లేదా ఇక్కడ విధుల్లో ఉండే సిబ్బంది వల్ల గానీ కొన్ని దోషాలు తెలియక జరుగుతుంటాయి. ఇలాంటి వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి విఘాతం కలకుండా నివారించడానికి ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
750 రూపాయలను చెల్లించడం ద్వారా ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. దీనికి సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే టికెట్లను పొందగలరని సూచించారు.
పవిత్రోత్సవాలను దృష్టిలో పెట్టకుని 15వ తేదీన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను రద్దు చేశారు. 16వ తేదీన అష్టదళ పాద పద్మారాధన సేవ రద్దయింది. 16, 17, 18వ తేదీలలో కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, వేద ఆశీర్వచనం, కుంకుమార్చన, ఊంజల్ సేవను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications