లడ్డూ వివాదం వేళ.. నెయ్యి క్వాలిటీపై
Tirumala Laddu row: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం నాడు 61,328 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,033 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.84 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 17 కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

అటు- ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిని జంతువుల కొవ్వు, చేప నూనెతో కల్తీ చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణల వేడి చల్లారట్లేదు.
రోజుకో మలుపు తీసుకుంటోంది. ఇప్పటికే ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన హైప్రొఫైల్ వ్యవహారం కేసులు, విచారణల వరకూ వెళ్లింది. తిరుమల లడ్డూ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టడానికి ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది.
సీనియర్ ఐపీఎస్ అధికారి, గుంటూరు రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి సారథ్యం వహిస్తోన్న ఈ సిట్ దూకుడు పెంచింది. తమిళనాడులోని దిండిగల్‌లో గల ఏఆర్ డెయిరీ యాజమాన్యంపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిట్ తన దర్యాప్తు మొదలు పెట్టింది.
ఈ పరిణామాల మధ్య కర్ణాటక పాల సమాఖ్య అధికారులు టీటీడీ కార్యనిర్వాహణాధికారి జే శ్యామలరావుతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తిరుపతిలో గల టీటీడీ పరిపాలన భవనంలో ఈ భేటీ ఏర్పాటైంది. కేఎంఎఫ్ ప్రతినిధులు నందిని డెయిరీ ఉత్పత్తుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
నెయ్యి క్వాలిటీ గురించి వివరించారు. పాల సేకరణ, నెయ్యి తయారీ, ఘీ ప్యూరిఫికేషన్, దాన్ని ట్యాంకర్లల్లో లోడ్ చేయడం వంటి కార్యకలాపాల గురించి తెలియజేశారు. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌ను సైతం ట్యాంకర్లకు అమర్చిన విషయాన్ని ఈవో శ్యామలరావు దృష్టికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం టీటీడీకి నందిని ట్రేడ్ మార్క్ నెయ్యిని సరఫరా చేస్తోంది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. కొద్దిరోజుల కిందటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా నెయ్యి ట్యాంకర్లను జెండా ఊపి ప్రారంభించిన విషయం తెలిసిందే. నందిని బ్రాండ్ నెయ్యిని శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీ కోసం వినియోగిస్తోంది టీటీడీ.












Click it and Unblock the Notifications