శ్రీవారి దర్శనంతో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌లో తిరుమల లడ్డూ బుకింగ్ - టీటీడీ ఏం చెబుతోంది?
తిరుపతి: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పుణ్యక్షేత్రం తిరుమలలో వెలిసిన శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు వస్తుంటారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటుంటారు. రోజూ శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. అదే స్థాయిలో భక్తులు తలనీలాలను సమర్పించుకుంటారు. ప్రతికూల పరిస్థితులు, వాతావరణంలోనూ గంటల కొద్దీ బారులు తీరి మరీ ఆ దేవదేవుడిని దర్శించుకుంటారు.

72 వేల మందికి పైగా..
మాండోస్ తుఫాన్ ప్రభావం వల్ల తిరుమలలో కుండపోత వర్షం కురుస్తోన్నప్పటికీ.. భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. 14 కంపార్టుమెంట్లలో వేచి ఉంటోన్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య..72,466. వారిలో 28,123 మంది తలనీలాలను సమర్పించారు. హుండీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన ఒక్కరోజు ఆదాయం 4.29 కోట్ల రూపాయలు.

లడ్డూకు డిమాండ్..
శ్రీవారిని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తుడు కూడా లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. దీనికి ఉన్న డిమాండ్ అసాధారణం. లడ్డూ ప్రసాదం కోసం భక్తుల మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయనే వార్తలు తరచూ వస్తుంటాయి. లడ్డూల కోసం కౌంటర్ల వద్ద భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, పంపిణీ నత్తనడకన సాగుతుండటం వల్ల గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోందనే వాదనలు కూడా వినిపిస్తుంటాయి.

ఆన్‌లైన్‌లో బుక్..
దీన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు కొత్తగా భక్తుల కోసం ఆన్‌లైన్ ద్వారా లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేసే సౌకర్యాన్ని కల్పించిందంటూ వార్తలు వెల్లువెత్తాయి. tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో లడ్డూను బుక్ చేసుకోవచ్చని, ఇలా ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ ఇచ్చిన వారికి హోమ్ డెలివరీ చేస్తామని టీటీడీ అధికారులు పేర్కొన్నారనేది ఆ వార్తల సారాంశం. తొలి విడతలో హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు సహా కొన్ని ప్రధాన నగరాల్లో ఈ వసతిని అందుబాటులోకి తీసుకొచ్చిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి.

క్లారిటీ ఇచ్చిన టీటీడీ..
భక్తులు నామమాత్రపు ధరను చెల్లించి అదనపు లడ్డూలను కూడా పొందవచ్చని టీటీడీ అధికారులను ఉటంకిస్తూ కథనాలు ప్రచురితం అయ్యాయి. ఈ వార్తలు, కథనాలపై టీటీడీ అధికారులు స్పందించారు. టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లడ్డూలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని తేల్చి చెప్పారు. ఈ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని తోసిపుచ్చారు. ఆ వార్తలను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

చట్టప్రకారం చర్యలు..
ఆన్‌లైన్ ద్వారా శ్రీవారి లడ్డూలను విక్రయించాలనే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు. టీటీడీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో భక్తులు దర్శన టికెట్‌ను బుక్ చేసుకునే సమయంలోనే మాత్రమే పరిమితంగా అదనపు లడ్డూలను కూడా బుక్ చేసుకునే అవకాశం ఉందని గుర్తు చేశారు. అంతేగానీ శ్రీవారి దర్శనంతో సంబంధం లేకుండా లడ్డూలను టీటీడీ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చంటూ జరుగుతున్న ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications