తిరుమల శ్రీవారి ఆలయానికి మరో నలుగురు ప్రధాన అర్చకులు: ఆ కుటుంబాల నుంచి
తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయానికి మరో నలుగురు ప్రధాన అర్చకులు నియమితులయ్యారు. ఇప్పటికే డాక్టర్ ఏవీ రమణ దీక్షితులను ప్రధాన అర్చకుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఆ వెంటనే ఆయన బాధ్యతలను తీసుకోవడం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూరకంగా కలుసుకోవడం చకచకా సాగిపోయాయి. తిరుమల శ్రీవారి ఆలయానికి మాత్రమే కాకుండా.. అనుబంధ దేవస్థానాల్లోనూ వంశపారంపర్య అర్చకత్వాన్ని జగన్ సర్కార్ పునరుద్ధరించింది.
ఇక తాజాగా- శ్రీవారి ఆలయానికి మరో నలుగురు ప్రధాన అర్చకులను నియమించింది టీటీడీ. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులు జారీ చేసింది. వంశపార్యపర అర్చకత్వ కుటుంబంలోని వారికే ఆ అవకాశాన్ని కల్పించింది. గొల్లపల్లి కుటుంబం నుంచి గోపినాథ్ దీక్షితులు, తిరుపతమ్మ కుటుంబం తరఫున నారాయణ దీక్షితులు, పైడపల్లి నుంచి రాజేష్ దీక్షితులు, పెద్దింటి కుటుంబానికి అర్చకత్వ ప్రతినిధిగా రవిచంద్ర దీక్షితులను నియమిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. శతాబ్దాల కాలం నుంచీ శ్రీవారి ఆలయంతో ముడిపడి ఉన్న ఆయా కుటుంబాలకు శ్రీవారిని సేవించే అవకాశాన్ని జగన్ సర్కార్ పునరుద్ధరించినట్టయింది.

రమణ దీక్షితులు ఇదివరకు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆయనకు ఉద్వాసన పలికారు. 65 సంవత్సరాలు దాటిన అర్చకులందరికీ బలవంతంగా పదవీ విరమణ కల్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోని అన్ని ఆలయాల్లోనూ దీన్ని వర్తింపజేస్తూ.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టీటీడీ ఛైర్మన్‌గా పనిచేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ పుట్టా మధుసూదన్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. వంశపారంపర్యంగా వస్తోన్న అర్చక వ్యవస్థకు స్వస్తి పలికారు. అప్పట్లో ఈ ఉత్తర్వులు పెద్ద ఎత్తున వివాదాన్ని రేపాయి.












Click it and Unblock the Notifications