తిరుపతి పోరు: రత్నప్రభ కోసం రంగంలోకి పవన్ కల్యాణ్ -నేడు తిరుపతిలో జనసేనాని పాదయాత్ర, భారీ సభ
ప్రతిష్టాత్మ తిరుపతి లోక్ సభ స్థానంలో ఉప ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం తిరుపతిలో పర్యటించనున్నారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరఫున ప్రచారం చేపట్టిన జనసేనాని.. తిరుపతిలో ఇవాళ పాదయాత్ర చేసి, బహిరంగ సభలో పాల్గొంటారు.
హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకోనున్న పవన్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి నగరంలో పాదయాత్ర చేస్తారు. ఎంఆర్ పల్లి సర్కిల్ నుంచి ఏఐఆర్ బైపాస్ మీదుగా శంకరంబాడి సర్కిల్ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. పాదయాత్ర ముగియనున్న శంకరంబాడి సర్కిల్ వద్ద సాయంత్రం పూట భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చేశారు.

జనసేన-బీజేపీ మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడి, పవన్ అలక వహించారని ప్రచారం జరగడం, తిరుపతి సీటు బీజేపీ దక్కడం, అభ్యర్థి రత్నప్రభపై జనసైనికులు అసంతృప్తిగా ఉన్నారని పార్టీ కీలక నేతలే వ్యాఖ్యలు చేసిన దరిమిలా పవన్ తిరుపతి టూర్ కు ప్రాధాన్యం ఏర్పడింది. జనసేన అధినేతకు తిరుపతిలో గ్రాండ్ వెల్కమ్ పలికేలా ఏపీ బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. పవన్ వెంట పాదయాత్రలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, ఇతర ముఖ్యనేతలు పాల్గొంటారు.
ఏపీ రాజకీయాల్లో బీజేపీ-జనసేన పొత్తు ప్రత్యామ్నాయంగా ఎదుగుతుంనే విశ్వాసం ప్రజల్లో కల్పించే విధంగా 'తిరుపతిలో పవన్ కల్యాణ్ పాదయాత్ర' ఉంటుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చీఫ్ నాదెండ్ల మనోహర్ ఇదివరకే వెల్లడించారు. పవన్‌కు ఘనంగా స్వాగతం పలికేందుకు స్థానిక నాయకులు, కార్యకర్తలతో పాటు 4 రాయలసీమ జిల్లాల నుంచీ శ్రేణులు తిరుపతికి రానున్నాయి.












Click it and Unblock the Notifications