శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్: ఆ దర్శనాలకు టీటీడీ రెడ్ సిగ్నల్
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. వేలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటోన్నారు. తమ మొక్కులను చెల్లించుకుంటోన్నారు. కొద్దిరోజులుగా శ్రీవారిని దర్శించుకుంటోన్న భక్తుల సంఖ్య 80 నుంచి 90 వేల మధ్య ఉంటోండటమే దీనికి నిదర్శనం.
గురువారం నాడు 65,416 మంది శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. వారిలో 36,128 మంది తల నీలాలను సమర్పించారు. హుండీ ద్వారా 3.51 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. సర్వదర్శనం టోకెన్లు ఉన్న వారికి స్వామివారి దర్శనానికి 20 గంటలకు పైగా సమయం పట్టింది.

కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోవడంతో పాటు సీతా తోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది. క్యూ లైన్‌లో ఉన్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అల్పాహారం, పాలు, మంచినీటి వసతిని కల్పించారు. ఈ రద్దీ మరిన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు.
తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో టీటీడీ అధికారులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఎలాంటి సిఫారసు లేఖలను కూడా స్వీకరించరు. వాటిని పరిగణనలోకి తీసుకోరు.
ఈ రద్దు- తక్షణమే అమలులోకి తీసుకొచ్చినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. జూన్ 30వ తేదీ వరకు కొనసాగుతుంది. అంటే జూన్ 30వ తేదీ వరకు ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండబోవు. మిగిలిన రోజుల్లో అంటే సోమ, మంగళ, బుధ, గురువారాల్లో బ్రేక్ దర్శనం అందుబాటులో ఉంటుంది.
వారాంతపు రోజుల్లో శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి వస్తోన్న సాధారణ భక్తుల సంఖ్య భారీగా ఉండటమే దీనికి కారణం. సాధారణ భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి 30 నుంచి 40 గంటల సమయం పడుతోంది. స్వామివారి దర్శనాన్ని కల్పించడంలో సామాన్యులకు అధిక ప్రాధాన్యత ఇస్తొన్నందున వీఐపీ బ్రేక్ దర్శనాలకు వారాంతపు రోజుల్లో బ్రేక్ పెట్టారు టీటీడీ అధికారులు.












Click it and Unblock the Notifications