TTD: శ్రీవాణి ట్రస్ట్ నిధుల లెక్కలు ఇలా - చర్యలు తప్పవు, ఛైర్మన్ వార్నింగ్..!!
Tirumala: తిరుమల శ్రీవాణి ట్రస్టు పైన రాజకీయంగా ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు...జనసేనాని పవన్ ఆరోపణలు చేసారు. దీని పైన టీటీడీ స్పందించింది. విమర్శలకు సమాధానంగా ఇప్పుడు లెక్కాపత్రంతో ముందుకొచ్చారు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి. శ్రీవారి ట్రస్ట్ నిధులపై శ్వేతపత్రం విడుదల చేశారు. శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు, నిధుల సేకరణ, కార్యక్రమాలకు సంబంధించి.. పూర్తి పారదర్శకతతో ఉన్నామని వెల్లడించారు.
శ్వేతపత్రం విడుదల
శ్రీవాణి ట్రస్టు పై వస్తున్న ఆరోపణలను టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి ఖండించారు. ట్రస్ట్ ద్వారా వచ్చిన మొత్తం రూ.861కోట్లుగా వెల్లడించారు. రూ.602 కోట్లు వేర్వురు బ్యాంకుల్లో డిపాజిట్ చేశామని తెలిపారు. మూడున్నరేళ్లలో బ్యాంకుల ద్వారా వడ్డీ రూపంలో రూ. 36 కోట్లు వచ్చిందని చెప్పారు. ఆలయాల నిర్మాణం, పాత ఆలయాల పునరుద్ధరణ, దీపదూప, గోసంరక్షణ, హిందూ ధర్మ ప్రచారం కోసం రూ. 120 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు ట్రస్ట్ ద్వారా ఏపీ సహా పలు రాష్ట్రాల్లో టీటీడీ తరఫున అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు. ఇచ్చిన విరాళాలకు సరైన రసీదులు ఇస్తున్నామని వివరించారు. ట్రస్ట్ నిధులను ఎవరూ దారి మళ్లించడం లేదని, విపక్ష నేతలు అన్నట్లుగా ట్రస్ట్ నిధులను దారి మళ్లిస్తే స్వామివారే శిక్షిస్తారని వ్యాఖ్యానించారు.

ఆదాయంర..ఖర్చుల లెక్కలిలా
వాణి ట్రస్టును ప్రారంభించిన తరువాత దళారీ వ్యవస్థను రూపుమాపామని... మొదటి ఆరు నెలల్లోనే ప్రక్షాళణ చేపట్టామని తెలిపారు. 70 మంది దళారులను అరెస్ట్ చేశామని... 214 కేసులు నమోదు చేశామన్నారు. 2019 సెప్టెంబర్ 23 నుంచి శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళాలు సమర్పించిన భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. అప్పటి నుంచి శ్రీవాణి ట్రస్ట్‌కు భక్తుల నుంచి భారీ స్పందన లభిస్తోందన్నారు. 8,24,400 మంది భక్తులు శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శనం చేసుకున్నారని తెలిపారు. శ్రీవాణి ట్రస్టు నిధులు ఎక్కడా దుర్వినియోగం కావడం లేదని స్పష్టం చేశారు. రూ.500, రూ.300లకు భక్తులకు రసీదు ఇవ్వడమనేది అవాస్తవమని చెప్పారు. శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు ఇచ్చిన భక్తులకు రాజ్యమార్గం ద్వారా స్వామి వారి దర్శనం కల్పిస్తున్నామన్నారు. శ్రీవాణి ట్రస్టు నిధులు వివిధ బ్యాంకుల్లో రూ.602.60 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని.. సేవింగ్స్ ఖాతాలో రూ.139 కోట్ల నిధులు ఉన్నాయని తెలిపారు. శ్రీవాణి ట్రస్టు నిధుల డిపాజిట్ల ద్వారా రూ.36.50 కోట్ల వడ్డీ వచ్చిందని వెల్లడించారు.

చట్టపరమైన చర్యలు తప్పవు
పలు కార్యక్రమాల నిర్వహణకు గాను రూ.120.24 కోట్లు ఖర్చు చేశామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసిన ప్రతీ ఒక్క భక్తుడికి రసీదులు ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 8 లక్షల మందికిపైగా భక్తులు శ్రీవాణి ట్రస్టు ద్వారా స్వామి వారిని దర్శించుకోగా.. ఎవరు టీటీడీపై ఆరోపణలు చెయ్యలేదన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శనానికి వెళితే రసీదులు ఇవ్వలేదంటూ టీటీడీపై ఆరోపణలు చేయటాన్ని ఖండించారు. ఆధారాలు లేకుండా రాజకీయ పరంగా నిరాధారమైన ఆరోపణలు చెయ్యడం తగదని హితవు పలికారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఆరోపణలు చేస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు.












Click it and Unblock the Notifications