తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం ఉచితంగా..ధర్మరథం
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో వాహన కాలుష్య నియంత్రణ దిశగా మరో ముందడుగు పడింది. మరో 10 ఎలక్ట్రిక్ బస్సులు శ్రీవారి భక్తుల కోసం అందుబాటులోకి వచ్చాయి. ఒలెక్ట్రా కంపెనీ తయారు చేసిన బస్సులు అవి. ఈ బస్సులను ప్రముఖ కాంట్రాక్ట్ సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ యాజమాన్యం ఉచితంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేసింది. తిరుమలలో ఈ బస్సు సర్వీసులు ప్రారంభం అయ్యాయి.
అంతకుముందు- టీటీడీ అడ్మినిస్ట్రేషన్ భవన్‌లో.. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. టీటీడీ కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, సూపరింటెండెంట్ ఇంజినీర్-2 జగదీశ్వర్ రెడ్డి, టీటీడీ రవాణా విభాగం జనరల్ మేనేజర్ శేషారెడ్డి, హెచ్‌ఓ డాక్టర్ శ్రీదేవి, డీఈవో హరీంద్రనాథ్, వీజీఓ బాలిరెడ్డి, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు.

ఈ బస్సులకు ధర్మరథం అని పేరు పెట్టారు. ఒక్కో బస్సు ధర సుమారు కోటి 80 లక్షల రూపాయలు. మొత్తం 18 కోట్ల రూపాయల విలువ చేసే 10 ఒలెక్ట్రా కంపెనీ తయారు చేసిన ఎలక్ట్రిక్ బస్సులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ- టీటీడీకి విరాళంగా అందజేసింది. తిరుమలలో పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా వాహన కాలుష్యాన్ని నివారించడానికి వీటిని వినియోగిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ఏడాది కిందటే ప్రారంభించామని ఆయన గుర్తు చేశారు.
టీటీడీ అధికారులు, సిబ్బందికి విధి నిర్వహణ కోసం 35 ఎలక్ట్రిక్ కార్లను ఇదివరకే మంజూరు చేశామని చెప్పారు. ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ప్రతిరోజు తిరుపతి నుంచి తిరుమల మధ్య 65 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోన్నారని పేర్కొన్నారు. తాజాగా 10 ఎలక్ట్రిక్ బస్సులు శ్రీవారి భక్తుల కోసం అందుబాటులోకి వచ్చాయని, వాటిని వినియోగించుకోవాలని వైవీ సుబ్బారెడ్డి సూచించారు. తిరుమలలో పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా ఇప్పటికే ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించామని చెప్పారు.
లడ్డు కౌంటర్లలో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను పూర్తిస్థాయిలో నిషేధించామని వివరించారు. మున్ముందు మరిన్ని చర్యలను తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కాగా- ఈ ఎలక్ట్రిక్ బస్సుల కోసం టీటీడీ- తన సొంత వర్క్‌షాప్‌తో పాటు తిరుమలలో ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయనుంది. టీటీడీ డ్రైవర్లకు ఎలక్ట్రిక్ బస్సులను నడింపించడానికి అవసరమైన శిక్షణను అందించడానికి ఇదివరకే ఒలెక్ట్రా సంస్థ ముందుకొచ్చింది. ఏప్రిల్ 15వ తేదీ నాటికి ఈ శిక్షణ పూర్తవుతుంది.












Click it and Unblock the Notifications