Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్ : వసతి - సేవా టికెట్లు విడుదల..!!
తిరుమలలో వసతి..సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. వచ్చే నెలలో అయిదు రోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేసారు.
Tirumala: తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు వేచి చూస్తున్నారు. సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది. ఇదే సమయంలో మార్చి నెలకు సంబంధించి తిరుమలలో నిర్వహించే ప్రత్యేక పర్వదినాలను టీటీడీ ప్రకటించింది. ఇదే సమయంలో తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు పలు ఆర్జితసేవలను టీటీడీ రద్దు చేసింది. మార్చి నెలకు సంబంధించిన వసతి కోటాను ఈ రోజు విడుదల చేయనుంది. మరి కొన్ని సేవా టికెట్లను రేపు విడుదల చేయనున్నారు. మార్చి నెలలో ఉగాది..శ్రీరామ నవమి సందర్భంగా తిరుమలలో ప్రత్యేకంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్దమైంది.

శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
తిరుమల లో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలుమార్చి 3 నుంచి 7వ తేదీ వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని టీటీడీ అధికారులు వెల్లడించారు. తెప్పోత్సవాల్లో తొలిరోజు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనం ఇస్తారని వివరించారు.
రెండవ రోజు మార్చి 4న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి అవతారంలో , 5,6 వ తేదీన శ్రీభూ సమేతంగా మలయప్పస్వామిఐదుసార్లు పుష్కరిణిలో తిరిగి దర్శనం ఇస్తారని అన్నారు. చివరి రోజు మార్చి 7న ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో దర్శనం ఇస్తారని వివరించారు.

ఆర్జిత సేవలు రద్దు..మార్చిలో ప్రత్యేక కార్యక్రమాలు
తెప్పోత్సవాల కారణంగా మార్చి 3, 4వ తేదీల్లో తోమాలసేవ, అర్చన, సహస్రదీపాలంకార సేవ, మార్చి 5, 6వ తేదీల్లో తోమాలసేవ, అర్చన, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, మార్చి 7న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. ఇక..మరోవైపు మార్చినెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ ఆదివారం ప్రకటించింది. 3న కులశేఖరాళ్వార్ వర్ష తిరునక్షత్రం, 7న కుమారధార తీర్థముక్కోటి, 18న అన్నమాచార్య వర్ధంతి, 22న ఉగాది సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆస్థానం, 30న శ్రీరామనవమి ఆస్థానం, 31వ తేదీన శ్రీరామపట్టాభిషేక ఆస్థానం జరుగనున్నాయి.

నేడు వసతి.. రేపు సేవా టికెట్ల విడుదల
మార్చి నెలకు సంబంధించిన తిరుమల..తిరుపతి..తలకోన వసతి కోటాను ఈ రోజు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. టీటీడీ అధికారిక వెబ్ సైట్ తో పాటుగా కొద్ది రోజుల క్రితం అందుబాటులోకి తీసుకొచ్చిన 'టీటీ దేవస్థానమ్స్ 'యాప్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయి. రేపు (ఫిబ్రవరి 28)న మార్చినెల అదనపు శ్రీవారి సేవ, తిరుమల తిరుపతి మరియు నవనీత సేవా టికెట్లను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. పరకామణి సేవా టికెట్లను ఫిబ్రవరి 28న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. రెండు రోజుల క్రితం మార్చి నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం.. సేవా టికెట్లు..శ్రీవాణి టోకెన్లను అనూహ్య స్పందన కనిపించింది. రెండు నెలలకు సంబంధించిన అంగప్రదిక్షణ టికెట్లు కేవలం 9 నిమిషాల్లోనే పూర్యయ్యాయి. అదే విధంగా రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కు సంబంధించి ఆరు లక్షల టోకెన్లు కేవలం 85 నిమిషాల్లోనే అమ్మకం పూర్తయింది. కేవలం గంటన్నార సమయంలోనే టికెట్ల ద్వారా టీటీడీకి రూ 28 కోట్ల ఆదాయం సమకూరింది.












Click it and Unblock the Notifications