తిరుమల ఘాట్ రోడ్‌లో వరుస ప్రమాదాలు- టీటీడీ మహా శాంతి హోమం
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్ట్‌మెంట్లల్లో భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్లల్లో భక్తులు వేచి ఉంటోన్నారు. బాట గంగమ్మ అమ్మవారి ఆలయం వరకూ బారులు తీరారు. టోకెన్ లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తోన్నారు.
శనివారం శ్రీవారిని 88,626 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 51,379 మంది తల నీలాలను సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి 3.29 కోట్ల రూపాయల ఆదాయం అందింది. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున దీనికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.

కాగా- ఈ మధ్యకాలంలో తిరుమల ఘాట్ రోడ్‌లో వరుసగా ప్రమాదాలు సంభవిస్తోన్నాయి. రెండు రోజుల కిందటే రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఓ టెంపో ట్రావెలర్ అదుపు తప్పి రోడ్డు పక్కన కొండను ఢీకొట్టింది. ప్రమాదానికి గురైన సమయంలో అందులో భక్తులు ఎవరూ లేరు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్తోండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
అంతకుముందు మొదటి ఘాట్ రోడ్‌లో 28వ మలుపు వద్ద ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాదానికి కారణం అతివేగమేనని పోలీసులు నిర్ధారించారు. ఈ తరహా వరుస ప్రమాదాలు తిరుమల ఘాట్ రోడ్లల్లో ఎప్పుడూ సంభవించలేదు. ప్రాణనష్టం తప్పినప్పటికీ భక్తులకు ఈ ఘటనలు ఆందోళనకు గురి చేస్తోన్నాయి.

ఈ పరిణామాల మధ్య టీటీడీ అధికారులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. బుధవారం తిరుమల ఘాట్ రోడ్‌లో మహా శాంతి హోమాన్ని జరిపించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి డౌన్ ఘాట్ రోడ్‌లో గల శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయం సమీపంలోని 7వ మైలు వద్ద ఈ మహా శాంతి హోమాన్ని నిర్వహించనున్నారు.
ఎగువ- దిగువ ఘాట్ రోడ్లలో ఇక ముందు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి, సమస్త మానవాళి, లోక శ్రేయస్సును కోరుతూ టీటీడీ అధికారులు ఈ విశిష్ట హోమాన్ని జరిపించడానికి ముందుకొచ్చింది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏవీ ధర్మారెడ్డి, ఇతర అధికారులు ఇందులో పాల్గొననున్నారు. శ్రీవారి భక్తుల కోసం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారమౌతుంది.












Click it and Unblock the Notifications