పవన్ ఇచ్చిన ఫిర్యాదుపై తిరుపతి జిల్లా ఎస్పీ రియాక్షన్ ఇదే..!!
తిరుపతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇవ్వాళ తిరుపతిలో ప్రత్యక్షం అయ్యారు. భారీ కాన్వాయ్‌తో ఎంట్రీ ఇచ్చారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర నాయకులతో కలిసి విజయవాడ గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.
అనంతరం పవన్ కల్యాణ్.. ర్యాలీగా తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. జిల్లాలోని శ్రీకాళహస్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అంజు యాదవ్‌పై లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. శ్రీకాళహస్తికి చెందిన పార్టీ కార్యకర్త కొట్టె సాయిపై చేయి చేసుకున్న సీఐ అంజు యాదవ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

దీనిపై ఎస్పీ పరమేశ్వర్ స్పందించారు. అంజు యాదవ్ ఉదంతంపై ఓ కమిటీ వేస్తామని తెలిపారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు. సీఐ అంజు యాదవ్, కొట్టె సాయికి ఎలాంటి పరిచయం లేదని, ఆయనను కొట్టడం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు కూడా కనిపించట్లేదని పేర్కొన్నారు.
కొద్దిసేపటి కిందటే ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఘటనపై తమకు మానవ హక్కు కమిషన్ నుంచి కూడా నోటీసులు అందాయని ఎస్పీ నిర్ధారించారు. దీనిపై సమాధానం ఇస్తామని వివరించారు. జనసేన పార్టీ కార్యకర్తను అంజు యాదవ్ కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో సర్కులేట్ అయిందని, దీన్ని కూడా తాము విచారణ కోసం ఆధారంగా చేసుకుంటామని పేర్కొన్నారు.

ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి దిష్టిబొమ్మను తగులబెట్టే ప్రయత్నం చేయడం తప్పు అని, దీన్ని నివారించడంలో భాగంగా అంజు యాదవ్.. ఆయనను కొట్టినట్లు తాము ప్రాథమికంగా భావిస్తోన్నామని, దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా అంజు యాదవ్, కొట్టే సాయిని విచారిస్తామని, దీని తరువాత తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు.
అంజు యాదవ్‌కు ఛార్జ్ మెమొ ఇవ్వలేదని, అదేదో అల్లాటప్పాగా ఇచ్చేది కాదని ఎస్పీ పరమేశ్వర్ అన్నారు. సమగ్ర దర్యాప్తు, విచారణ తరువాతే చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కొట్టే సాయిపై అంజు యాదవ్ చేయి చేసుకోవడం వెనుక రాజకీయ కారణాలు లేవని వివరించారు. అంజు యాదవ్‌తో తనకు ఇదివరకు ఎలాంటి పరిచయం లేదని కొట్టే సాయి చెప్పినట్లు ఎస్పీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications