బెజవాడ కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టేంత పట్టుచీర
విజయవాడ: నేత కార్మికులకు పెట్టింది పేరు తెలంగాణలోని సిరిసిల్ల. మగ్గాలపై అద్భుతాలను సృష్టిస్తుంటారు. అగ్గిపెట్టెలో పట్టేంత చీర.. అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు సిరిసిల్లే. సిరిసిల్లకు చెందిన ఓ నేత కార్మికుడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి, తిరుచానూరు పద్మావతి అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టేంత బంగారు చీరను సమర్పించారు. దీని విలువ 45,000 రూపాయలు. అగ్గిపెట్టెలో పట్టేలా ఆయన దీన్ని తయారు చేయించారు.
అలాగే పద్మావతి అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టేలా అయిదు గ్రాముల బరువు ఉండే బంగారంతో నేసిన జరీ చీర తయారు చేయించారు. ఇప్పుడు అదే సిరిసిల్లకు చెందిన మరో భక్తుడు- విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టేంత బంగారు చీరను సమర్పించారు. చీరను అమర్చిన అగ్గిపెట్టెను శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులకు అందజేశారు. మగ్గంపై నేసిన పట్టు చీర అది.

దీని విలువ 30,000 వేల రూపాయలు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. నాలుగు మీటర్లు పొడవు ఉన్న ఈ పట్టు చీరను నేయడానికి పట్టు, బంగారం, వెండి జరీని వినియోగించారు. కనకదుర్గమ్మ అమ్మవారికి సమర్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా దీన్ని తయారు చేయించారు. ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి ఉన్న ఈ పట్టు చీరను ఆయన కనకదుర్గమ్మ ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
పూజల అనంతరం ఆలయ అర్చకులు, అధికారులు ఆ భక్తుడికి తీర్థప్రసాదాలను అందజేశారు. అమ్మవారి చిత్రపటాన్ని అందించారు. కాగా- కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య సాధారణంగా ఉంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షలు కొనసాగుతున్నందున భక్తుల తాకిడి చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండట్లేదని అధికారులు చెబుతున్నారు. పరీక్షలు ముగిసిన తరువాత భక్తుల రద్దీ పెరుగుతుందని, దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోన్నామని వివరించారు.












Click it and Unblock the Notifications