టీడీపీ ఎమ్మెల్సీ రాజీనామా ఎఫెక్ట్: శాసన మండలికి ఉప ఎన్నిక: షెడ్యూల్ ఇదే వైసీపీ గెలుపుపై
అమరావతి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఒక శాసనమండలి స్థానానికి ఉప ఎన్నికను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కొద్దిసేపటి కిందటే కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ మాజీ నాయకురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేయడం వల్ల ఏర్పడిన ఖాళీ అది. టీడీపీకి గుడ్‌బై చెప్పిన అనంతరం ఆమె అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోతుల సునీతే పోటీ చేయవచ్చని తెలుస్తోంది. దీనిపై ప్రకాశం జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఇదీ షెడ్యూల్..
కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 11వ తేదీన నోటిఫికేషన్ వెలువడుతుంది. నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి తేదీ.. 18. మరుసటి రోజు నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. వాటిని ఉపసంహరించుకోవడానికి 21వ తేదీ వరకు గడువు ఉంటుంది. 28వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్‌ను నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు.
Recommended Video

ఆ షరతుతోనే..
ఈ ప్రక్రియ మొత్తం వచ్చేనెల 1వ తేదీ నాటికి ముగుస్తుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం అండర్ సెక్రెటరీ ప్రఫుల్ అశ్వతి షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ తరఫున పోతుల సునీత పోటీ చేయడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. తాను రాజీనామా చేయడం వల్ల ఏర్పడిన ఖాళీని మళ్లీ తనతోనే భర్తీ చేయాలనే షరతుతో ఆమె వైఎస్సార్సీపీలో చేరారని అంటున్నారు.

గెలుపు
ఈ ఉప ఎన్నికలో గెలిచిన అభ్యర్థి ఎమ్మెల్సీ కాల పరిమితి మరో రెండేళ్ల పాటు ఉంటుంది. 2023 మార్చి 29న ముగుస్తుంది. రెండేళ్లకు పైగా ఎమ్మెల్సీగా కొనసాగే ఛాన్స్ ఉన్నప్పటికీ.. తన పదవికి రాజీనామా చేశానని అందుకే- తననే మళ్లీ శాసన మండలికి పంపించాలని పోతుల సునీత కండీషన్ పెట్టినట్లు సమాచారం. ఈ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ విజయం సాధించడం లాంఛనప్రాయమే అవుతుంది. శాసన సభ్యుల కోటా కింద ఈ ఎన్నిక జరుగనుంది. అధికార పార్టీకి చాలినంత బలం ఉంది. పోతుల సునీత చేసిన రాజీనామాను గత ఏడాది నవంబర్ 1వ తేదీన మండలి ఛైర్మన్ షరీఫ్ ఆమోదించిన విషయం తెలిసిందే.

ఏపీతో పాటు బిహార్, యూపీల్లో..
కాగా- ఏపీతో పాటు మరో రెండు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసన మండలి స్థానాలకు కూడా అదే రోజు ఉప ఎన్నికను నిర్వహిస్తారు. బిహార్‌లో ప్రస్తుతం రెండు శాసన మండలి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటికి కూడా అదే రోజు ఉప ఎన్నిక పోలింగ్ ఉంటుంది. ఉత్తర ప్రదేశ్‌లో బైనియల్ ఎన్నికలను అదే రోజు నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications