జై అమరావతి..రాజధాని ఇక్కడే ఉండాలి: విశాఖకు వ్యతిరేకం కాదు: అండగా ఉంటాం.. చంద్రబాబు హామీ!
టీడీపీ అధినేత చంద్రబాబు..జై అమరావతి అంటూ నినదించారు. అమరావతి రైతులకు అండగా నిలుస్తామని ప్రకటించారు. రాజధానిగా అమరావతి కొనసాగించే వరకూ పోరాటం చేస్తామని ప్రకటించారు. పరిపాలనతోనే అభివృద్ధి కాదని తేల్చి చెప్పారు. హైకోర్టు..అసెంబ్లీ..సచివాలయం వలన అభివృద్ధి కాదన్నారు. ఆ రోజు తాను వ్యక్తిగా కాకుండా ముఖ్యమంత్రిగా రైతులకు హామీ ఇచ్చానని..అధికారంలోకి ఎవరొచ్చినా ఆ హామీని కొనసాగించాలని..నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసారు. రాజకీ యాలు తరువాత..అమరావతి కావాలని స్పష్టం చేసారు.
తెలుగు జాతి పూర్వ వైభవం అమరావతి అని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వ హామీలు నెరవేర్చమంటే అది చట్ట విరుద్దమని..రాజ్యంగ విరుద్దమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెబుతున్న ప్రభుత్వం హై కోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయించాలని..తప్పు జరిగితే ఎవరి మీదైనా చర్య తీసుకోవాలని..అందుకు తాము సహకరిస్తామని చంద్రబాబు ప్రకటించారు. విశాఖకు తాము వ్యతిరేకం కాదని..అయితే అమరావతి రైతుల విషయంలో బాధ్యత ఉందన్నారు.

మాట తప్పారు..మడమ తిప్పారు..
నాడు ప్రతిపక్ష నేతగా జగన్ అసెంబ్లీ సాక్షిగా రాజధానికి అంగీకరించారని చంద్రబాబు గుర్తించారు. 2014, సెప్టెంబర్ 4న అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ విజయవాడలో రాజధాని ఏర్పాటును ఆహ్వానిస్తు న్నానని చెప్పిన విషయాన్ని గుర్తు చేసారు, 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో చిచ్చు పెట్టటం ఇఫ్టం లేక మద్దతిస్తున్నాని చెప్పిన ప్రకటనను చంద్రబాబు చదివి వినిపించారు. అదే సమయంలో రాజధాని కనీసం 30 వేల ఎకరాలు ఉండాలని నాడు సభలో జగన్ చెప్పలేదా అంటూ గుర్తు చేసారు. మరి..ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన జగన్ ఎందుకు మాట తప్పారు..మడమ తిప్పారని చంద్రబాబు నిలదీసారు.

తప్పు జరిగితే హైకోర్టు జడ్జితో విచారణ చేయించండి..
అమరావతిలో అవినీతి జరిగితే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని..ఎవరైనా తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు. తాము పూర్తిగా సహకరిస్తామని ప్రకటించారు. అదే విధంగా రూపాయి ఖర్చు లేకుండా రాజధాని ఏ రకంగా అభివృద్ధి చేయవచ్చో తాను వివరించానని.. అమరావతిలో అన్ని మౌళిక వసతులు కల్పించినా..పది వేల ఎకరాల భూమి ఉంటుందని..దానిని అమ్మకోవటం ద్వారా నిధులు సమకూర్చుకోవచ్చని వివరించారు. ఇది తాను నిరూపించటానికి సిద్దంగా ఉన్నానని సవాల్ చేసారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో రాజధాని మార్పు నిర్ణయం తీసుకోవద్దని చెప్పారు.

పరిపాలనతో అభివృద్ధి జరగదు..
కేవలం అసెంబ్లీ..సచివాలయం భవనాలతో..లేక పరిపాలనతో అభివృద్ధి జరగదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ...పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి జరగదని స్పష్టం చేసారు. మూడు రాజధానులు ఎక్కడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. హైదారాబాద్ లో సైతం అవి ఉన్నా అభివృద్ధి జరగలేదని..ఏయిర్ పోర్ట్.. విమానాశ్రయం.. రింగ్ రోడ్డు..సైబరాబాద్ వచ్చిన తరువాతనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని వివరించారు. ఎక్కడైనా ఇల్లు కట్టాలంటేనే నాలుగైదేళ్లు పడుతుందని.. హైదరాబాద్ లో పోలీసు కంట్రోల్ రూం ఏర్పాటుకు అయిదేళ్లు పడుతోందని చెప్పుకొచ్చారు.

విశాఖకు వ్యతిరేకం కాదు..
విశాఖ నగరం అంటే తనకు ఎంతో ఇష్టమని..తాను హుదుద్ తుఫానుతో వారితో వారం రోజులు కలిసి ఉన్నానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. విశాఖకు తాను వ్యతిరేకం కాదని..అదే సమయంలో తనను నమ్మి భూములు ఇచ్చిన అమరావతి రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత తనకు ఉందన్నారు. విశాఖ లో 70 వేల కోట్లతో ఆదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొస్తే దానిని ఈ ప్రభుత్వం వెళ్లిపోయేలా చేసిందని విమర్శించారు, లూలూ గ్రూపు ద్వారా భారీ కన్వెన్షన సెంటర్ కోసం ఒప్పందం చేసుకుంటే వీళ్లు రద్దు చేసారని చెప్పుకొచ్చారు. జాతీయ విద్యా సంస్థల్లో విజయనగరానికి ప్రాధాన్యత ఇచ్చామని చంద్రబాబు వవరించారు. శ్రీకాకుళంలో చేసిన పనులను చెప్పుకొచ్చారు. విశాఖ లో తీసుకొచ్చిన సంస్థల గురించి వివరించారు.

ఎక్కడైనా మూడు రాజధానులు ఉన్నాయా
దేశంలో ఎక్కడైనా మూడు రాజధానులు ఉన్నాయా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆయన ఎక్కడ ఈ విధంగా చూసారని ప్రశ్నించారు. సచివాలయం విశాఖలో ఉంటే..మంత్రులకు ఇక్కడ నివాసాలు ఇస్తారా అని నిలదీసారు. తన మీద కోపం ఉంటే రాజకీయంగా విభేదించండి..కానీ, రైతులను శిక్షించకండంటూ అభ్యర్ధించారు. అమరావతిలో ఒక్క ఎకరా కూడా ముంపుకు గురయ్యే పరిస్థితి లేదన్నారు. చెన్నై.. హైదరాబాద్ కంటే అమరావతి అభివృద్ధి చెందుతుందని ఐఐటీ సర్వేలో చెప్పిన విషయాన్ని గుర్తు చేసారు. కర్నూలులో హైకోర్టు పైన తాను గతంలోనే హామీ ఇచ్చానని గుర్తు చేసారు.

ఎవరీ జీఎన్ రావు..ఏంటా కమిటీ..
ఇక..జీఎన్ రావు కమిటీ పైన చంద్రబాబు మండిపడ్డారు. ఈ జీఎన్ రావు తన వద్ద పని చేసిన అధికారి అని గుర్తు చేసారు. అసలు ఈ కమిటీ ఎక్కడ పర్యటించింది..ఎవరిని సంప్రదించింది అని నిలదీసారు. ముఖ్యమంత్రి ఫలితాలు ప్రకటించిన తరువాత జీఎన్ రావు పరీక్ష రాసినట్లు ఉందన్నారు. అది జీఎన్ రావు కమిటీ కాదని..జగన్ కమిటీ అని వ్యాఖ్యానించారు. అసలు ఆ కమిటీ చేసిన సిఫార్సులు అర్ద రహిత మంటూ చంద్రబాబు మండిపడ్డారు. అసెంబ్లీలో ముందుగానే ముఖ్యమంత్రి చెప్పిన అంశాలనే కమిటీ ప్రస్తావించిందని వివరించారు. 27న ఈ కమిటీ మీద చర్చిస్తారని..ఎందుకు ఈ చర్చ అని ప్రశ్నించారు. రైతులతో మాట్లాడకుండా నివేదిక ఇచ్చారా అని నిలదీసారు

రైతులకు మద్దతుగా ఉంటా..
అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా నిలుస్తానని చంద్రబాబు స్పష్టం చేసారు. వారి పోరాటానికి సంఘీభావంగా నిలుస్తాననన్నారు. రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇక్కడ అనవసరం గా రైతులను రెచ్చగొట్టి.. ప్రజల ఉసురు తగిలితే ముఖ్యమంత్రిగా మీకు మంచిది కాదంటూ సూచించారు. అండగా తాను..పార్టీ నిలుస్తుందని చంద్రబాబు స్పష్టం చేసారు. చెప్పిన మాట నిలబెట్టకోవటానికి నిలుస్తా మన్నారు. ఇతర రాజకీయ పార్టీలు సైతం అండగా నిలుస్తున్నాయన్నారు. అమరావతి రాజధానిగా కొనసాగించే వరకూ పోరాటం సాగిస్తామని చంద్రబాబు విస్పష్ట ప్రకటన చేసారు.












Click it and Unblock the Notifications