రాముడి విగ్రహ ధ్వంసంలో చంద్రబాబు పాత్ర .. ఇది టీడీపీ కుట్ర : వైసీపీ ఎంపీ సాయిరెడ్డి సంచలనం
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం ఘటనపై సంచలన ఆరోపణలు చేశారు. రాముడి విగ్రహం ధ్వంసం ఘటనలో చంద్రబాబు పాత్ర ఉందని విజయసాయి రెడ్డి ఆరోపించారు. సీఎం జగన్ అదే రోజు విజయనగరం జిల్లాలో పర్యటించారని గుర్తు చేసిన ఎంపీ, సీఎం జగన్ కు చెడ్డపేరు ఆపాదించాలనే కుట్రతోనే రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లుగా పేర్కొన్నారు.

మెంటలెక్కిందని అనుకుంటున్నారు.. ఆ నాయుడి పేరేమి : ఎంపీ విజయసాయి ప్రశ్నకు నెటిజన్ల షాకింగ్ ఆన్సర్స్

చంద్రబాబు నాయుడు కుట్రదారుడు
చంద్రబాబు నాయుడు కుట్రదారుడు అని , నెగటివ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. చంద్రబాబుకు ఎవరికీ సహాయం చేసే ఉద్దేశం ఉండదని, తన స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి అని వ్యాఖ్యానించారు. తన స్వార్థం కోసం దేనినైనా తాకట్టు పెట్టడానికి వెనుకాడని, సొంత మామను సైతం వెన్నుపోటు పొడిచారని చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయనగరం జిల్లాలో నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించ తలపెట్టగానే టీడీపీ కుట్ర చేసిందని ఆరోపించారు.

టీడీపీ వాళ్ళు చేసిన పనే .. ఆధారాలతో దొరికింది
టిడిపి నేతలు కొండపైకి వెళ్లి రాములవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి, స్వామివారి విగ్రహం శిరస్సును కోనేరులో పడవేశారని, దానికి సంబంధించిన అన్ని ఆధారాలు లభించాయని వ్యాఖ్యానించారు. ఇటువంటి ద్రోహానికి తలపెట్టిన వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీనే స్వామివారి విగ్రహం ధ్వంసం ఘటన వెనుక ఉందని సంచలన ఆరోపణలు చేశారు విజయసాయిరెడ్డి. విజయనగరం జిల్లాలో జరిగే అద్భుతమైన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై దృష్టి మరల్చడం కోసమే ఈ పని చేశారన్నారు.

విజయనగరం జగన్ పట్టాల పంపిణీపై దృష్టి మరల్చటం కోసమే ఇదంతా
సీఎం జగన్ ని ఇబ్బంది పెట్టడం కోసమే ఈ పనిచేశారని విజయసాయి అభిప్రాయపడ్డారు. ఇదంతా చంద్రబాబు , లోకేష్ కనుసన్నల్లోనే జరిగిందని, విగ్రహ ధ్వంసం ఘటనల వెనుక టిడిపి హస్తముందని, దోషులను త్వరలోనే శిక్షిస్తామని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.
మరోపక్క రామతీర్ధంలో స్వామి వారి విగ్రహ పునః ప్రతిష్టకు ఏర్పాట్లు చేస్తున్నారు . ఈ కేసులో విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వారిని పట్టుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు విజయనగరం డీఎస్పీ అనీల్ తెలిపారు.