ముహూర్తం పెట్టిన చంద్రబాబు: పండగ వాతావరణంలో..
Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. అన్నా క్యాంటీన్లను ప్రారంభించడానికి ముహూర్తం ఖరార్ చేసింది.
కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఆగస్టు 15వ తేదీన సాయంత్రం 6:30 గంటలకు చంద్రబాబు చేతుల మీదుగా ఇది ప్రారంభం కానుంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు కానున్న ఇది తొలి క్యాంటీన్ ఇదే. అందుకే చంద్రబాబే లాంఛనంగా ప్రారంభించడానికి పూనుకున్నారు.

తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలంటూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజున అంటే ఆగస్టు 16వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 99 అన్న క్యాంటీన్లు ఆరంభం కానున్నాయి. కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు.. అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నారు.
తమ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దశలవారీగా రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీలను సైతం ఇచ్చిన విషయం తెలిసిందే. వాటి పునరుద్ధరణకు సంబంధించిన ప్రతిపాదనలపై చంద్రబాబు తొలి సంతకం చేశారు కూడా.
అన్నా క్యాంటీన్ల కాన్సెప్ట్‌ను తమిళనాడు తొలిసారిగా అమలు చేసింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అయిదు రూపాయలకు ఉదయం టిఫిన్, 10 రూపాయలకు మధ్యాహ్నం, రాత్రి వేళ భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతో అమ్మ క్యాంటీన్లు పేరుతో వాటిని ఏర్పాటు చేసింది అప్పట్లో.
దీన్ని 2018లో చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో అమలు చేసింది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల అవి మూతపడ్డాయి. దీన్ని పునరుద్ధరిస్తామని తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దీనికి అనుగుణంగా అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ఏర్పాటు కానున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వాటికి ముహూర్తం పెట్టారు.












Click it and Unblock the Notifications