రాపాక వరప్రసాద్ - వల్లభనేని వంశీకి ఆహ్వానం : ఇక అఫీషియల్..!!
వచ్చే ఎన్నికలకు సీఎం జగన్ కసరత్తు ముమ్మరం చేసారు. వచ్చే జనవరి నుంచి మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా మంత్రులు..ఎమ్మెల్యేలతో వర్క్ షాపు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేల ప్రోగ్రస్ కార్డులతో సీఎం కీలక నిర్ణయాల దిశగా ఈ సమావేశం జరుగుతోంది. ఇదే సమయంలో బూత్ లెవల్ నుంచి పార్టీ ఏ విధంగా ప్రజలతో మమేకం కావాలో సీఎం నిర్దేశించనున్నారు. ఇక, ఇదే సమయానికి వైసీపీకి అనుబంధంగా వ్యవహరిస్నున్న రాపాక వరప్రసాద్.. వల్లభనేని వంశీ హాజరయ్యారు. వై నాట్ 175 లక్ష్యంలో భాగంగా వీరికి ఆహ్వానం అందింది.

వై నాట్ 175..కీలక నిర్ణయాల దిశగా
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల కసరత్తు వేగవంతం చేసారు. అందులో భాగంగా ఎమ్మెల్యేలకు డెడ్ లైన్ ఫిక్స్ చేసేందుకు సిద్దమయ్యారు. మంత్రులు - ఎమ్మెల్యేలతో గడపగడపకు చివరి వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల పని తీరుకు సంబంధించి సీఎం జగన్ తన లక్ష్యం ఏంటో స్పష్టం చేసారు. 27 మంది ఎమ్మెల్యేలు తన అంచనాలను చేరుకోవటంలో వెనుక బడి ఉన్నట్లుగా గుర్తించారు. వారికి పని తీరు మెరుగు పర్చుకొనేందుకు సమయం నిర్దేశించారు. ఇప్పుడు వారితో పాటుగా మిగిలిన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి తన వైఖరి స్పష్టం చేయనున్నారు. ఇందు కోసం నియోజకవర్గా వారీగా పూర్తి సమాచారంతో సీఎం ఈ సమావేశం ఏర్పాటు చేసారు. గడపగడపకు సంబంధించి దాదాపుగా ఇదే చివరి సమావేశం. ఇక, జనవరి నుంచి పార్టీని బూత్ లెవల్ నుంచి బలోపేతం దిశగా కొత్త కార్యాచరణ సీఎం జగన్ ఈ సమావేశం ద్వారా నిర్దేశించనున్నారు.

రాపాక - వల్లభనేని హాజరు..
వై నాట్ 175. ఇదీ ఈ సారి సీఎం జగన్ నినాదం. అందు కోసం తన పార్టీకి చెందిన 151 నియోజకవర్గాలతో పాటుగా ప్రతిపక్షాలు గెలిచిన 23 సీట్లు ఈ సారి గెలిచి తీరాల్సిందేనని పట్టుదలతో ఉన్నారు. ఇదే సమయంలో 2019లో జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్.. టీడీపీ నుంచి గెలిచిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. ఈ రోజు సీఎం నిర్వహిస్తున్న సమీక్ష కు వారిద్దరూ హాజరయ్యారు. ఈ ఇద్దరూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు - నియోజకవర్గ ఇంఛార్జ్ లతో జరుగుతున్న సమావేశంలో వీరి హాజరు ద్వారా వైసీపీ నుంచి వీరిద్దరి పోటీ ఖరారు అయినట్లే. దీంతో, పార్టీ అమలు చేస్తున్న వ్యూహాల్లో ఈ ఇద్దరూ భాగస్వాములు కానున్నారు. ఇప్పటికే వంశీ వచ్చే ఎన్నికల్లో తాను వైసీపీ నుంచి పోటీ చేయటం ఖాయమని ధీమాగా చెబుతున్నారు. అటు రాపాకలోనూ వర ప్రసాద్ కే టికెట్ ఖాయమనే ప్రచారం సాగుతోంది.

అభ్యర్ధుల ఖరారుపై సీఎం జగన్ క్లారిటీ
వచ్చే ఎన్నికలకు సంబంధించి ఆరు నెలల ముందుగానే అభ్యర్ధులను ప్రకటించాలని సీఎం జగన్ నిర్ణయించారు. అయితే, సిట్టింగ్ ల్లో ఎంత మందికి తిరిగి అవకాశం ఇస్తారనేదే ఇప్పుడు అసలు చర్చగా మారుతోంది. మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించి సీఎం జగన్ ఇప్పటికే సర్వే నివేదికలు తెప్పించుకున్నారు. ప్రతీ నియోజకవర్గం పైన నిశితంగా అధ్యయనం చేస్తన్నారు. నియోజకవర్గాలకు మూడు కేటగిరీలుగా విభజించారు. అందులో భాగంగా ఇప్పటి వరకు గెలవని నియోజకవర్గాల పైన కొత్త వ్యూహం అమలుకు సిద్దమయ్యారు. ఇక, సర్వే నివేదికల ఆధారంగా పని తీరులో వెనుకబడిన ఎమ్మెల్యేలకు నేటి సమావేశం ద్వారా డెడ్ లైన్ ఫిక్స్ చేయనున్నారు. జనవరి నుంచి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించనున్నారు.












Click it and Unblock the Notifications