భవిష్యత్తులో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ఇలా ఉండబోతోంది..!!
విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటించారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీకనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 216 కోట్ల రూపాయల విలువైన పలు పనులకు శ్రీకారం చుట్టారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేసిన ఎనిమిది ఆలయాలను పునఃప్రారంభించారు.
కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో అన్నప్రసాద భవనం- 30 కోట్లు, అమ్మవారి లడ్డూ ప్రసాదం పోటు భవనం- 27 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనుంది ప్రభుత్వం. దేవస్థానం నిధులు 13 కోట్ల రూపాయలతో కనకదుర్గనగర్ నుంచి మహామండపం వరకు ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్‌ను నిర్మించనుంది.

రాజగోపురం ముందు మెట్ల నిర్మాణం- 23.50, కనకదుర్గనగర్ ప్రవేశ ద్వారం వద్ద మహారాజ ద్వారం- 7.75 కోట్లు, కొండపైన పూజా మండపం- 7 కోట్లు, మల్లికార్జున మహామండపం క్యూకాంప్లెక్స్- 18.30 కోట్లు, నూతన కేశఖండనశాల- 19 కోట్లు, గోశాల వద్ద మల్టీ పర్పస్ కాంప్లెక్స్- 10 కోట్ల రూపాయలతో నిర్మించనుంది.

దాతల సహకారంతో అమ్మవారి ఆలయం నుంచి మల్లేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకునే మార్గంలో అయిదు కోట్ల రూపాయలతో గ్రానైట్ రాతి యాగశాలను నిర్మించనుంది. దేవస్థానం- ప్రైవేటు భాగస్వామ్యంతో 33 కోట్ల రూపాయలతో కనకదుర్గనగర్‌లో మల్టీలెవల్ కారు పార్కింగ్ నిర్మాణ పనులకు జగన్ శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణ పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు.

అనంతరం వైఎస్ జగన్ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పాలక మండలి కమిటీ సభ్యులు, అర్చకులు ఆయనకు అమ్మవారి తీర్థప్రసాదాల, చిత్రపటాన్ని అందజేశారు. శేషవస్త్రాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, హోం మంత్రి తానేటి వనిత, దేవాదాయ శాఖ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు.












Click it and Unblock the Notifications