అయ్యన్న పాత్రుడి అడ్డాపై జగన్ ఫోకస్..!!
అనకాపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుసగా జిల్లాల పర్యటనలు సాగిస్తోన్నారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీన బాపట్ల జిల్లాలో పర్యటించారు. యడ్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేశారు. ఒక్కరోజు విరామం తరువాత ఆయన ఇవ్వాళ తన సొంత జిల్లాలో పర్యటిస్తోన్నారు. ఈ మధ్యాహ్నం కడప జిల్లా కమలాపురంలో 900 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

పులివెందులలో..
శని, ఆదివారాల్లో పులివెందులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పులివెందుల ఆర్టీసీ బస్టాండ్‌ను ప్రారంభించబోతోన్నారాయన. బలపనూరులో గ్రామ సచివాలయం భవన సముదాయం, తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభిస్తారు. వైఎస్సార్ మెమోరియల్ పార్క్, రాయాలాపురం బ్రిడ్జి అందుబాటులోకి తీసుకుని రానున్నారు జగన్.

నర్సీపట్నంలో..
మూడు రోజుల కడప జిల్లా పర్యటన ముగిసిన వెంటనే ఉత్తరాంధ్రకు బయలుదేరి వెళ్లనున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 1,000 కోట్ల రూపాయల అంచనాతో తలపెట్టిన ప్రాజెక్టులవి. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ నిర్మాణానికి వైఎస్ జగన్ భూమి పూజ చేయనున్నారు. దీని నిర్మాణ వ్యయం 500 కోట్ల రూపాయలు.

28న ఖాయం..
ఇప్పటికే- 8,000 కోట్ల రూపాయలతో 16 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 16 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి ప్రభుత్వం పూనుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నర్సీపట్నంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వైద్య కళాశాల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం రెండుసార్లు వాయిదా పడింది. మూడోసారి ఈ నెల 28వ తేదీన ఖాయం చేశారు.

మాకవరపాలెంలో..
నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలోని మాకవరపాలెంలో ఈ మెడికల్ కాలేజీని ప్రభుత్వం నిర్మించనుంది. అక్కడే బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు జగన్. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, వైఎస్ఆర్సీపీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్, తలశిల రఘురాం తదితరులు స్థలాన్ని పరిశీలించారు కూడా.

అయ్యన్న పెట్టని కోట..
కాగా- రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గం.. నర్సీపట్నం. తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి సొంత నియోజకవర్గం ఇది. ఆరుసార్లు ఆయన ఇక్కడి నుంచి విజయం సాధించారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ చేతిలో 23 వేలకు పైగా ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అలాంటి చోట మెడికల్ కాలేజీ సహా పలు అభివృద్ధి పనులకు స్వయంగా ముఖ్యమంత్రి చేపట్టడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.












Click it and Unblock the Notifications