విజయవాడ కనకదుర్గమ్మ గుడికి మహర్దశ: కోట్ల రూపాయలతో 4 ఆలయాలు అభివృద్ధి
విజయవాడ: విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ, మల్లేశ్వరస్వామివార్ల ఆలయాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. తెలంగాణలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి వెలిసిన యాదాద్రి తరహాలో ఇంద్రకీలాద్రిని అభివృద్ధం చేయాలని సంకల్పించింది. దీనికోసం 225 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది.
ఈ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఉదయం ఆయన విజయవాడకు చేరుకుంటారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేసిన ఆలయాల నిర్మాణానికి కూడా జగన్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుంటారు.

కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాభివృద్ధికి అవసరమైన మాస్టర్ ప్లాన్‌ను దేవాదాయ మంత్రిత్వ శాఖ ఇదివరకే రూపొందించింది. టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. ప్రసాదం పోటు, అన్న దానం భవన సముదాయం నిర్మిస్తారు. శివాలయాన్ని జీర్ణోద్ధరిస్తారు.దుర్గగుడి ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడకుండా రక్షణ చర్యలు తీసుకుంటారు.
వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగుకుండా నాలుగు అంతస్తుల ఆటోమేటిక్ కార్ పార్కింగ్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకుని రానుంది. ఇప్పుడున్న క్యూ కాంప్లెక్స్‌కు అదనంగా మరో క్యూ కాంప్లెక్స్‌ను ప్రభుత్వం నిర్మించనుంది. క్యూ లైన్ల కోసం ర్యాంప్, అన్నదాన భవన సముదాయాన్ని రెండు అంతస్తుల్లో ఏర్పాటు చేస్తారు.
డిసెంబర్ 8వ తేదీన శ్రీశైలంలో చేపట్టే అభివృద్ధి పనులకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారు. దీని వ్యయం 125 కోట్ల రూపాయలు. 60 కోట్ల రూపాయలతో సింహాచలం, 80 కోట్ల రూపాయలతో అన్నవరం, 70 కోట్ల రూపాయలతో ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రాలు అభివృద్ధి చెందనున్నాయి.












Click it and Unblock the Notifications