వారికి సాయం చెయ్యండి.. మాజీమంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి ఎమ్మెల్సీ ఒకరోజు దీక్ష
ఏపీలో వైసీపీ సర్కార్ కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకోవాలని టీడీపీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేస్తున్నారు . కరోనా ప్రబలకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ కాలంలో చాలా మంది నిరుపేద కూలీలు ఉపాధి కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. ఇక ఉపాధి కోల్పోయిన వారికి రూ.5వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తూ ఆయన ఒక రోజు దీక్షకు దిగారు .
టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలోని తన స్వగృహంలో నేడు ఒకర్జు దీక్ష చేపట్టారు . శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు ఆయన బడుగు బలహీన వర్గాల కోసం , వారికి ఉపాధి లేకపోవటంతో నెలకొన్న ఇబ్బంది నేపధ్యంలో ఆయన దీక్ష చేయనున్నారు. అలాగే పేదవాడి కడుపు నింపే అన్నా క్యాంటీన్లను తెరవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు . అన్నా క్యాంటీన్లతో పేదల ఆకలి తీరుతుందని , ఇప్పుడు వాటి అవసరం చాలా ఉందని ఆయన పేర్కొన్నారు .

చంద్రన్న భీమా పథకాన్ని తిరిగి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక లాక్ డౌన్ ఎఫెక్ట్ వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని , రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన పేర్కొన్నారు . కొల్లు రవీంద్ర చేపట్టిన దీక్షకు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు సంఘీభావం తెలిపారు. ఇక ఇదే సమయంలో కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రజలను అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లిలో ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు 10 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ తమ సంఘీభావం తెలిపారు.












Click it and Unblock the Notifications