ఏపీ హైకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్: ఏర్పాట్లు పూర్తి
విజయవాడ: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై రానున్న జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి ప్రమాణ స్వీకారానికి చురగ్గా సన్నాహాలు పూర్తవుతున్నాయి ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి సోమవారమే రిలీవ్ అయ్యారు. ఆయన స్థానంలో అరుప్ కుమార్ గోస్వామి హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలను స్వీకరించనున్నారు. బుధవారం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కొందరు మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. అరుప్ కుమార్ గోస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే ఆయన హైకోర్టుకు వెళ్తారని, పిటీషన్లపై విచారణ నిర్వహిస్తారని అంటున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా కోల్‌కత నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ.. సోమవారమే ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుత చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అదే రోజు సాయంత్రం ఆయన రిలీవ్ అయ్యారు. సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జేకే మహేశ్వరి బదిలీ అయిన విషయం తెలిసిందే. అరుప్ గోస్వామి బుధవారం మంగళవారం రాత్రి లేదా బుధవారం ఉదయం విజయవాడకు చేరుకుంటారని సమాచారం. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ హిమా కోహ్లీ కూడా బుధ లేదా గురువారాల్లో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుత చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి.. గురువారం నాడు సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తారని అంటున్నారు.