గాయత్రీ దేవిగా బెజవాడ దుర్గమ్మ- 40 లక్షల హారం కానుకిచ్చిన ఎన్నారై భక్తుడు..
సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తోంది. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి. బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది.గాయత్రీ ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రీ మంత్రజపం చతుర్వేదం పారాయణ ఫలితాన్ని ఇస్తుంది.
ఇవాళ బెజవాడ కనకదుర్గమ్మ దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీ గాయత్రీ దేవి రూపంలో దర్శనిస్తోంది.

దసరా నవరాత్రుల సందర్భంగా అమెరికా నుంచి వచ్చిన తాతినేని శ్రీనివాస్ అనే ఎన్నారై భక్తుడు అమ్మవారికి రూ.40 లక్షల విలువైన హారాన్ని బహూకరించారు. అట్లాంటాలో ఉండే తన కుమారుడి తొలి జీతంతో అమ్మవారికి హారం సమర్పించినట్లు శ్రీనివాస్ తెలిపారు. ఆరు నెలల నుంచి అమ్మవారికి ఏడు వారాల నగలు అలంకరిస్తున్నట్లు ఆలయ ఈవో సురేష్ బాబు తెలిపారు. సోమవారం ముత్యాలు, మంగళవారం పగడాలు, బుధవారం పచ్చలు, గురువారం కనకపుష్యరాగాలు, శుక్రవారం డైమండ్, శనివారం నీలాలు, ఆదివారం కెంపులతో అలంకరిస్తున్నారు.

అమ్మవారికి హారం కానుకగా ఇవ్వాలనుకుంటున్నట్లు శ్రీనివాస్ ఆలయ అధికారులను సంప్రదించారు. దీంతో వారు కనకపుష్యరాగం హారం చేయించి ఇవ్వాలని సూచించారు. వారి సూచన మేరకు శ్రీనివాస్ రూ.40 లక్షల రూపాయలతో హారం చేయించి ఇవాళ ఆలయ ఈవో సురేష్‌బాబు, ఇతర అధికారుల సమక్షంలో అందజేశారు. కనక పుష్యరాగాలన్నీ ఒకే సైజులో ఉండేందుకు సింగపూర్ నుంచి వీటిని తెప్పించినట్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా భక్తులెవరైనా అమ్మవారికి ఏడు వారాల నగలు సమర్పించాలనుకుంటే దేవస్ధానంలో సంప్రదించాలని ఈవో సురేష్ బాబు కోరారు.