ఏపీ బీజేపీ భుజంపై మోడీ సర్కార్ తుపాకీ: జగన్ సర్కార్ టార్గెట్:అమిత్ షా డైరెక్షన్‌లో భారీ సభ
విజయవాడ: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా మారనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై సమరశంఖాన్ని పూరించనున్నారు. ఎలాంటి మొహమాటాలకు వెళ్లకుండా- జగన్ సర్కార్‌పై ఎదురుదాడికి దిగనున్నారు. పార్టీ జాతీయ స్థాయి నాయకుల నుంచి స్పష్టమైన సంకేతాలు అందడంతో రాజకీయ యుద్ధాన్ని ప్రకటించబోతోన్నారు.

విజయవాడ కేంద్రంగా..
ఇందులో భాగంగా- విజయవాడలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు. ప్రజా ఆగ్రహ సభ పేరుతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ సభ ఆరంభమౌతుంది. సాయంత్రం వరకూ కొనసాగుతుంది. విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ గ్రౌండ్‌లో ఈ సభను నిర్వహించనున్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజమంత్రి ప్రకాష్ జవదేకర్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. పలువురు జాతీయ స్థాయి నేతలు పాల్గొననున్నారు.

ప్రత్యక్ష యుద్ధానికి శ్రీకారం..
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత.. బీజేపీ నాయకులు ఈ స్థాయిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కానుంది. జగన్ సర్కార్ అనుసరిస్తున్నట్లు చెబుతోన్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా తాము ప్రత్యక్ష యుద్ధానికి దిగబోతున్నామని, దీనికి ఈ సభ ద్వారా శ్రీకారం చుట్టబోతున్నామని బీజేపీ నాయకులు చెబుతున్నారు. రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలనే డిమాండ్‌ను కూడా ఈ సభ ద్వారా వైసీపీ ప్రభుత్వానికి స్పష్టంగా వినిపిస్తామని పేర్కొన్నారు.

కేంద్రంతో మెతక వైఖరినే..
నిజానికి- దేశ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ తటస్థంగా ఉంటోంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలో గానీ, కాంగ్రెస్ నేతృత్వాన్ని వహిస్తోన్న యూపీఏతో గానీ సత్సంబంధాలను నెలకొల్పుకోలేదు. ఈ రెండు కూటములకు సమదూరాన్ని పాటిస్తూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో ఏనాడూ ఘర్షణ వైఖరికి కూడా దిగలేదు. పైగా- మోడీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మూడు వ్యవసాయ చట్టాల వంటి కొన్ని బిల్లుల విషయంలో ఎన్డీఏ వైపే మొగ్గు చూపింది కూడా.

డైలమాను వీడి..
వైఎస్ఆర్సీపీ అనుసరిస్తోన్న వైఖరి వల్ల ఏపీ బీజేపీ నాయకులు ఇన్ని రోజులు కొంత డైలమాలో కనిపించారు. ఆలయాలపై దాడులు, తిరుపతి లోక్‌సభ, బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైసీపీపై పోటీకి దిగడం, జగన్ సర్కార్ తీసుకున్న విధాన పరమైన నిర్ణయాలను వ్యతిరేకిస్తూనే వచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని గానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గానీ ఏనాడూ విమర్శించకపోవడం.. కొంత మెతక వైఖరిని ప్రదర్శవించడం వల్ల జగన్ సర్కార్‌పై బాహటంగా యుద్ధాన్ని ప్రకటించలేకపోయారు బీజేపీ నాయకులు.

అమిత్ షా డైరెక్షన్..
బీజేపీలో నంబర్ టూగా ఉంటోన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన సూచనలతో బీజేపీ నాయకులు తమ వ్యూహాన్ని మార్చుకున్నట్లు చెబుతున్నారు. ఎన్డీఏ మిత్రపక్షంగా లేని పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదంటూ ఢిల్లీ పెద్దల నుంచి అందిన ఆదేశాల ప్రకారం.. రాష్ట్ర శాఖ నాయకులు ఈ ప్రజా ఆగ్రహ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి స్పష్టమైన సంకేతాలు రావడం, రోజులు గడుస్తున్నప్పటికీ- వైఎస్ఆర్సీపీ.. ఎన్డీఏలో చేరే విషయాన్ని కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకపోవడంతో రాజకీయ ప్రత్యర్థిగానే పరిగణిస్తోన్నాయి.












Click it and Unblock the Notifications