విజయవాడ మహిళలను వణికిస్తున్న సైకో-రాత్రయితే చాలు భయం భయం-కంటి మీద కునుకు లేకుండా
విజయవాడ నగరంలో ఓ సైకో మహిళలకు కంటి మీద కునకు లేకుండా చేస్తున్నాడు. అర్ధరాత్రి ఇళ్లల్లోకి చొరబడుతూ వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. కిటికీలు,బాత్రూమ్‌ల చాటున నక్కి రహస్యంగా వారిని చూస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఇంటి తలుపు కొట్టి... మహిళల మీద పడిపోయి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. విజయవాడలోని అయ్యప్ప నగర్,అశోక్ నగర్ ప్రాంతాల్లో ఈ సైకో హల్‌చల్ చేస్తున్నాడు. దీంతో ఆ ప్రాంతాల్లోని మహిళలు రాత్రయిందంటే చాలు వణికిపోతున్నారు.

స్థానికులు ఏం చెబుతున్నారు...
విజయవాడ పటమటలంక పోలీస్ స్టేషన్ పరిధిలో అయ్యప్ప నగర్,అశోక్ నగర్ ప్రాంతాలు ఉన్నాయి. ఏడాదిన్నరగా ఈ కాలనీల్లో ఓ సైకో హల్‌చల్ చేస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. స్థానిక మహిళ ఒకరు మాట్లాడుతూ... రాత్రిపూట వాష్ రూమ్ వెళ్లేందుకని ఇంటి తలుపు తీసుకుని బయటకు వచ్చినట్లు తెలిపారు. ఆ సమయంలో ఆ సైకో బాత్రూమ్‌లో దాక్కున్నాడని... తాను గట్టిగా కేకలు పెట్టడంతో అతను పారిపోయాడని చెప్పారు. మరో మహిళ మాట్లాడుతూ... అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి తన మీద పడిపోయాడని చెప్పారు. తాను దొంగా దొంగా అంటూ కేకలు పెట్టడంతో పారిపోయినట్లు తెలిపారు.

నల్ల చొక్కా,నల్ల ప్యాంట్,మంకీ క్యాప్‌తో...
స్థానికుల కథనం ప్రకారం... రాత్రిపూట అతను నల్ల చొక్కా,నల్ల ప్యాంట్,మంకీ క్యాప్ ధరించి తిరుగుతున్నాడు.మొదట కిటికీల వద్దకు వచ్చి టార్చిలైట్ వేసి చూస్తున్నాడు. ఎవరెవరు ఎక్కడ నిద్రిస్తున్నారో గమనిస్తున్నాడు. ఒకవేళ మహిళలు ఒంటరిగా ఉన్నట్లు తెలిస్తే... వెంటనే తలుపు కొడుతున్నాడు. తలుపు తీయడమే ఆలస్యం... వారి మీద పడిపోయి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఒకవేళ ఎవరైనా పట్టుకున్నా దొరక్కుండా చేతులకు నూనె రాసుకుని వస్తున్నాడు. అయ్యప్ప నగర్,అశోక్ నగర్ ప్రాంతాల్లో చాలామంది మహిళలు ఈ సైకో బారినపడినట్లు చెబుతున్నారు. పరువు పోతుందన్న భయంతో చాలామంది బయటకు రావట్లేదని అంటున్నారు.

ఎమ్మెల్యేను ఆశ్రయించిన స్థానికులు
గతేడాది వేసవిలో ఓ కుటుంబం తలుపులు తీసి నిద్రిస్తుండగా ఇదే సైకో ఇంట్లోకి చొరబడి బాలికపై దాడికి యత్నించాడు. బాలిక గట్టిగా అరవడంతో అక్కడినుంచి పారిపోయాడు. స్థానికులు ఇప్పటివరకూ పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా అతన్ని పట్టుకోలేకపోయారని చెబుతున్నారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను కలిసి సైకో ఆగడాలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే అయ్యప్ప నగర్,అశోక్ నగర్ కాలనీల్లో సీసీ కెమెరాలు పెట్టేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. 14 మంది మహిళలు తన వద్దకు వచ్చి ఫిర్యాదు చేశారని చెప్పారు. అర్ధరాత్రి తలుపులు కొట్టి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న అతనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.

పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని...
సైకో ఆగడాలతో స్థానిక మహిళలు రాత్రయిందంటే చాలు వణికిపోతున్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా వస్తాడో తెలియక భయపడిపోతున్నారు. చిన్నపిల్లలు,పెద్దవాళ్లు అన్న తేడా లేకుండా స్త్రీల పట్ల అతను అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెబుతున్నారు. గతంలో దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడని అంటున్నారు. పోలీసులు ఇకనైనా అతనిపై ప్రత్యేక నిఘా పెట్టి అరెస్ట్ చేయాలని అంటున్నారు. రాత్రుళ్లు సైకో భయానికి పెప్పర్ స్ప్రేని పక్కన పెట్టుకుని నిద్రపోతున్నామని వాపోయారు. పోలీసులు సైకోని పట్టుకుంటే తప్ప తమకు నిద్ర కరువేనని అంటున్నారు.