టీడీపీ నేత పట్టాభి భార్యకు వైసీపీ నుంచి అనూహ్య మద్దతు..ఫోన్ చేసి పరామర్శ-
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో.. ఆయన భార్య చందన నిరసన దీక్షకు దిగారు. ఇంటి వద్దే బైఠాయించారు. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆమెకు ఫోన్ చేసి, పరామర్శించారు.
విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరంలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు చల్లారట్లేదు. గన్నవరం చేరుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటోన్నారు. ఈ క్రమంలో పలువురిని అరెస్ట్ చేశారు. మరికొందరిని గృహ నిర్బంధంలో ఉంచారు. ఉద్రిక్త పరిస్థితులను నివారించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకుంటోంది. 144 సెక్షన్ ను విధించింది. 30 పోలీస్ యాక్ట్ ను అమల్లోకి తెచ్చింది.

వంశీపై దూషణల ఎఫెక్ట్..
గన్నవరం శాసన సభ్యుడు వల్లభనేని వంశీపై తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యక్తిగత దూషణలు చేశారనే కారణంతో ఆయన వర్గీయులు పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. అద్దాలను పగులగొట్టారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఆఫీస్ ఆవరణలో పార్క్ చేసిన వాహనాలకు నిప్పు పెట్టారు. దీనితో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ వరుస ఘటనలపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. డీజీపీకి లేఖ రాశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి- రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మారుస్తున్నాడని విమర్శించారు.

పోలీస్ స్టేషన్ లో..
కాగా- కిడ్నాప్ అయినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించిన అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ప్రస్తుతం గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఆయనతో పాటు మరో 16 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారిని న్యాయస్థానం సమక్షానికి హాజరు పర్చనున్నారు. గన్నవరం చేరుకోవడానికి ప్రయత్నించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. చిల్లకల్లు వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తమ వాహనంలో విజయవాడ తరలించారు.

పట్టాభి భార్య హౌస్ అరెస్ట్..
అలాగే పట్టాభిరామ్ భార్య చందనను హౌస్ అరెస్ట్ చేశారు. మంగళగిరిలోని పోలీస్ డైరెక్టర్ జనరల్ కార్యలయానికి వెళ్లడానికి ఆమె ప్రయత్నించారు. తనవెంట పలువురు టీడీపీ కార్యకర్తలను తీసుకుని మంగళగిరి డీజీపీ ఆఫీస్ ను ముట్టడించడానికి ప్రయత్నించిన కారణంగా చందనను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. దీనితో ఆమె నిరసనకు దిగారు. ఇంట్లోనే బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పరామర్శించిన రఘరామ..
నిరసనకు దిగిన చందనకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనూహ్య మద్దతు లభించింది. వైసీపీ తిరుగుబాటు లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు ఢిల్లీ నుంచి ఆమెకు ఫోన్ చేశారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అవసరమైతే ఢిల్లీలో కొత్త గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ను కలుస్తాననీ భరోసా ఇచ్చారు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఢిల్లీ స్థాయిలో పరిష్కరిస్తానని అన్నారు.
సమాచారం లేదు..
తన భర్త ఎక్కడ ఉన్నాడనే విషయం ఇప్పటివరకు తనకు తెలియలేదని చందన అన్నారు. రాతంత్రా ఆయనను పోలీసులు ఎక్కడెక్కడో తిప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పట్టాభి కళ్లద్దాలు పోయినట్లు సమాచారం అందిందని వివరించారు. ఇంట్లో అందరం ఆడవాళ్లమే ఉన్నామని, పట్టాభికి ఏమైందోననే ఆందోళనతో కంటి మీద కునుకు లేకుండా గడిపామని, ఎంతో కంగారుపడ్డామని చందన చెప్పారు. ఆయన సురక్షితంగా ఉన్నారని పోలీసులు కనీస సమాచారం కూడా తమకు ఇవ్వలేదని పేర్కొన్నారు. సమయానికి పట్టాభి మందులు వేసుకోవాల్సి ఉందని, అవి కూడా ఆయనకు అందనివ్వలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications