తొక్కాలని చూసే శక్తులు, కంటికి కనిపించని శతృవులు ఉన్నారు- బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!
విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి- విజయవాడ తూర్పు నియోజకవర్గం అభ్యర్థిగా దేవినేని అవినాష్ పేరును ఖరారు చేసిన నేపథ్యంలో- యువజన విభాగం చీఫ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 2024 నాటి ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గంల్లో విజయవాడ ఈస్ట్ కూడా ఉంటుందని పేర్కొన్నారు.

ఒకే వేదికపై..
తాజాగా విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో ఓ క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవానికి దేవినేని అవినాష్, స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఏపీ ఛైర్మన్, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం చీఫ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాల్గొన్నారు. పార్టీలో యువనేతలుగా వీరిద్దరికీ మంచి ఛరిష్మా ఉంది. ఇద్దరూ ఒకే వేదిక మీద కనిపించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన పలువురు యువనేతలు దీనికి హాజరయ్యారు.

బైరెడ్డి ప్రశంసలు..
విజయవాడ తూర్పు నియోజకవర్గం టికెట్ ఖరారైన నేపథ్యంలో- దేవినేని అవినాష్ ను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రశంసించారు. కాబోయే ఎమ్మెల్యేగా అభివర్ణించారు. దేవినేని నెహ్రూ వారసత్వాన్ని అవినాష్ కొనసాగిస్తాడనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఒక లెగసీని కొనసాగించడం, నిలబెట్టుకోవడం అంటే మాటలు కాదని, అలాంటి బాధ్యతను అవినాష్ తీసుకున్నాడని వ్యాఖ్యానించారు. తాను రాజకీయాల్లో అడుగు పెట్టే నాటికే అవినాష్ ఎన్నికల్లో పోటీ కూడా చేశారని చెప్పారు.

మోయలేనంత బాధ్యత..
రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన యువనేతలపై 24 గంటల పాటు మోయలేనంత భారం ఉంటుందని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. అలాంటి యువనేతల జీవితం పూల పాన్పు కాదని చెప్పారు. తమ తాతలు, తండ్రుల వారసత్వాన్ని నిలబెట్టుకోవడం సులభతరం కాదని వ్యాఖ్యానించారాయన. ఎప్పటికప్పుడు తమను తొక్కేయాలని చూసే శక్తులు, కంటికి కనిపించని శతృవులు పొంచివుంటారని వాటన్నింటినీ అధిగమించిన ఒక స్థాయికి చేరుకోవాలంటే సామాన్యమైన విషయం కాదని చెప్పారు.

దేవినేనికి టికెట్ ఖాయం చేయగానే..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ తూర్పు నియోజకవర్గం అభ్యర్థిగా దేవినేని అవినాష్ పేరును ప్రకటించగానే.. రాష్ట్రంలో అందరికంటే ఎక్కువగా తానే సంతోషపడి ఉంటానని బైరెడ్డి అన్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పుడే ఓ యువనేతకు టికెట్ ఖాయం కావడంతో- మరికొందరు యువనేతలు టికెట్ కోసం కష్టపడే అవకాశం ఉందని, సమాజానికి యువనేతల అవసరం ఉందని చెప్పారు.

బైరెడ్డికి అండగా జగన్..
దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. బైరెడ్డికి అండగా ఏకంగా ముఖ్యమంత్రే ఉన్నారని ప్రశంసించారు. భవిష్యత్ లో ఆయన అత్యున్నత స్థానానికి చేరుకుంటారనడంలో సందేహం అక్కర్లేదని చెప్పారు. యువకుల్లో మంచి ఛరిష్మా ఉన్న నాయకుడని బైరెడ్డికి కితాబిచ్చారాయన. తనతో పాటు పేర్ని కిట్టు కూడా బైరెడ్డిని ఎంతగానో అభిమానిస్తామని, ఓ అత్యున్నత విలువలతో కూడిన రాజకీయం చేసిన కుటుంబం నుంచి బైరెడ్డి వచ్చారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications