విజయవాడ పటమటలో భీభత్సం.. ఇనుపచువ్వతో దాడి.. దెబ్బతిన్న కుడికన్ను
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ నగరానికి చెందిన మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు అడ్డుకోవడంతో గాంధీని వదిలేసి వెళ్లిపోయారు. దుండగులు ఇనుపచువ్వతో దాడి చేయడంతో ఆయన కుడి కన్ను పూర్తిగా దెబ్బతింది. విజయవాడలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

మా ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ పెత్తనమేంటి?
తెలుగుదేశం పార్టీ తరఫున విజయవాడ నగర రాజకీయాల్లో గాంధీ చురుగ్గా పాల్గొంటున్నారు. కార్పొరేటర్‌గా నాలుగుసార్లు విజయం సాధించారు. ప్రస్తుతం 9వ డివిజన్‌కు ఆయన భార్య కాంతిశ్రీ కార్పొరేటర్‌గా ఉన్నారు. పైపులైను లీకవుతోందంటూ ఫిర్యాదులు రావడంతో కార్పొరేషన్ సిబ్బందితో పనిచేయిస్తున్నారు.
అదే డివిజన్‌కు చెందిన వైసీపీ అధ్యక్షుడు గద్దే కల్యాణ్, సుబ్బు, వల్లూరి ఈశ్వరప్రసాద్‌తోపాటు మరో నలుగురు అక్కడికి వచ్చారు. మా ప్రభుత్వం అధికారంలో ఉంది.. ఇక్కడ తెలుగుదేశం పెత్తనం ఏమిటంటూ గొడవకు దిగారు. అందరూ కలిసి ఒక్కసారిగా గాంధీపై దాడికి దిగారు.

ఇనుపచువ్వతో దాడి.. దెబ్బతిన్న కుడికన్ను
మాకు ఎదురులేదు.. నిన్ను చంపుతామని, నీకు దిక్కెవరంటూ ప్రశ్నించారు. మా ప్రభుత్వం మంజూరు చేసిన పనులు నువ్వు చేయించడమేంటంటూ కర్రలు, రాళ్లతో దాడికి దిగడంతోపాటు ముష్టిఘాతాలు కురిపించారు. ఇనుపచువ్వ తీసుకొని దాడిచేయడంతో గాంధీ కుడికన్ను పూర్తిగా దెబ్బతింది. అక్కడే ఉన్న స్థానికులు అడ్డుపడటంతో వారు వెళ్లిపోయారు.
గాంధీని ఆసుపత్రికి తరలించారు. ఎంపీ కేశినేని నాని, తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్, ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, పరుచూరి అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, పలువురు కార్పొరేటర్లు ఆయన్ను పరామర్శించారు. గాంధీ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. పటమట లంక ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్స్ తో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

రెండుగా విడిపోయిన తెలుగు యువత నాయకులు
తెలుగు యువత ఆధ్వర్యంలో ఇక్కడ ఏటా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అందరూ కలిసికట్టుగా వేడుకలు నిర్వహించేవారు. ఇటీవల పార్టీలు మారడంతో రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం తమను పిలవకుండా ఉత్సవాలు చేస్తున్నారని మనసులో పెట్టుకొని గొడవకు దిగారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
గాంధీ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు ఫోన్‌లో అడిగి తెలుసుకున్నారు. గాంధీ కంటిచూపు దెబ్బతిందని కుటుంబ సభ్యులు చెప్పడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని, మరింత మెరుగైన చికిత్స అందించాలని స్థానిక నేతలకు సూచించడంతోపాటు గాంధీపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని చంద్రబాబు ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications