బాలికపై లైంగిక వేధింపులు: కేశినేని నాని సన్నిహితుడి అరెస్ట్: పార్టీ నుంచి సస్పెండ్
విజయవాడ: విజయవాడ ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అయ్యారనే ఆరోపణలను ఎదుర్కొంటోన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వినోద్ కుమార్ జైన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వినోద్ కుమార్ జైన్ ఉదంతాన్ని తెలుగుదేశం పార్టీ కూడా తీవ్రంగా పరిగణించింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

బాలికపై వేధింపులు..
బెంజ్ సర్కిల్ వద్ద గల ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 13 సంవత్సరాల బాలికను వినోద్ జైన్ లైంగికం వేధించారని, వాటిని తాళ లేక ఆ బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనలో ఆ బాలిక రాసిన మూడు పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వినోద్ జైన్ పేరును ఇందులో ప్రస్తావించిందా బాలిక. అతను ఎలా ఇబ్బందులకు గురి చేశాడనే విషయాన్ని రాశారు. ఈ సూసైడ్ నోట్ ఆధారంగా భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు వినోద్ జైన్‌ను అరెస్ట్ చేశారు. అతను బాలికను లైంగిక వేధించాడని పోలీసులు నిర్ధారించారు.

టీడీపీ తరఫున పోటీ..
వినోద్ జైన్ గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు. విజయవాడ 37వ డివిజన్ కార్పొరేటర్‌గా పోటీ చేసి, ఓడిపోయారు. స్థానిక ఎంపీ కేశినేని నాని, నెట్టెం రఘురామ్, విజయవాడకు చెందిన ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులకు సన్నిహితుడనే పేరుంది. ఆ సాన్నిహిత్యంతోనే కార్పొరేటర్‌గా టికెట్ తెప్పించుకోగలిగాడని పార్టీ నాయకులు చెబుతున్నారు. పోలీసులు అతణ్ని అరెస్ట్ చేసిన వెంటనే.. పార్టీ క్రమశిక్షణపరమైన చర్యలను తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు నెట్టెం రఘురామ్ తెలిపారు.

పరామర్శించిన మంత్రి వెల్లంపల్లి..
బాలిక తల్లిదండ్రులను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు మల్లాది విష్ణు పరామర్శించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. వినోద్ జైన్ ఆ బాలికను లైంగికంగా ఇబ్బందులకు గురి చేశాడని, ఆ కారణంతోనే ఆ బాలిక అపార్ట్‌మెంట్ టెర్రస్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని అన్నారు. అతని ఆకృత్యాలను వివరిస్తూ బాలిక మూడు పేజీల సూసైడ్ నోట్ రాసిందంటే ఆమె ఎంత వేదనకు గురైందో అర్ధం చేసుకోవచ్చని చెప్పారు. వినోద్ జైన్ కేశినేని నాని ముఖ్య అనుచరుడని అన్నారు.

యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి..
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వినోద్ జైన్ తరపున చంద్రబాబు సైతం ప్రచారం చేశారని గుర్తు చేశారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు అతని దారుణాలపై ఎందుకు పెదవి విప్పట్లేదని ప్రశ్నించారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై మల్లాది విష్ణు స్పందించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడటం పట్ల చంద్రబాబు నాయుడు, కేశినేని నాని ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. బాలిక ఆత్మహత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications