పవన్ వారాహి యాత్రకు పోటెత్తిన అభిమానులు-బందరు రోడ్డు జనసంద్రం-జనసేన సభ ఆలస్యం..
జనసేన పదో ఆవిర్భావ సభ సందర్భంగా విజయవాడ నుంచి వారాహి వాహనంపై పవన్ కళ్యాణ్ రేపట్టిన ర్యాలీకి జనం పోటెత్తారు.
విజయవాడ : ఏపీలో జనసేన పార్టీ పెట్టి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మచిలీపట్నంలో ఇవాళ జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తోంది. ఈ సభపై జనసేన పార్టీతో పాటు అన్ని పార్టీల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఈ సభలో పవన్ చేసే వ్యాఖ్యలతో పాటు ప్రకటించే నిర్ణయాలు ఉత్కంఠ రేపుతున్నాయి.
మచిలీపట్నంలో జరిగే జనసేన పదో ఆవిర్బావ దినోత్సవ సభకు అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లాలని నిర్ణయించారు. అలాగే విజయవాడ నుంచి మచిలీపట్నం వరకూ తన ప్రచార వాహనం వారాహిపై తొలిసారి పవన్ బయలుదేరాలని నిర్ణయిచారు. దీంతో పవన్ వారాహి వాహనం తొలియాత్ర ప్రారంభించింది.

విజయవాడ బందరు రోడ్డులోని ఆటోనగర్ టెర్మినల్ దగ్గర మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరాల్సిన పవన్ కళ్యాణ్ నోవోటెల్ హోటల్ నుంచి ఆలస్యంగా చేరుకున్నారు. అప్పటికే పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురుచూస్తున్న అభిమానాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వేచి చూస్తున్నారు. పవన్ రాగానే అభిమానులు ఒక్కసారిగా ముందుకు దూకారు. వారాహి వాహనాన్ని చుట్టుముట్టారు. తన కారులో ఆటోనగర్ చేరుకున్న పవన్ అభిమానుల హర్షధ్వానాల మధ్య వారాహిపైకి చేరుకున్నారు.

విజయవాడ బందరు రోడ్డులోని ఆటోనగర్ బస్ టెర్మినల్ నుంచి మొదలైన వారాహి విజయయాత్ర.. అడుగులో అడుగు వేస్తూ సాగింది. అభిమానులు పోటెత్తడంతో వారాహి వాహనం ముందుకు కదలడం కష్టంగా మారింది. అభిమానులు జయజయ ధ్వానాలు పలుకుతూ పెద్దఎత్తున వారాహిని అనుసరించారు. ఆటోనగర్ టెర్మినల్ నుంచి పప్పుల మిల్లు సెంటర్, కానూరు కామయ్య తోపు సెంటర్, తాడిగడప సెంటర్, పోరంకి సెంటర్, పెనమలూరు సెంటర్ మీదుగా వారాహి యాత్ర సాగుతోంది.

పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర బయలుదేరగానే అభిమానులు భారీ క్రేన్లతో పూలదండలు ఏర్పాటు చేసి పవన్ కు వేసేందుకు ప్రయత్నించారు. పవన్ కూడావారిని నిరాశపరచకుండా అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తనను చూసేందుకు వచ్చిన అభిమానుల్ని ప్రతీ ఒక్కరినీ వారాహి వాహనంపై పలకరించేందుకు ప్రయత్నించారు.












Click it and Unblock the Notifications