అచ్చెన్న కాబోయే హోంమంత్రి- రేసులో ముగ్గురు- అందరికీ బాబు పిచ్చి - సాయిరెడ్డి కామెంట్స్
ఏపీలో పంచాయతీ ఎన్నికల కేంద్రంగా సాగుతున్న రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న వార్ కూడా రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని టీడీపీ రాష్ట్ర అద్యక్షుడు అచ్చెన్నాయుడు స్వస్ధలం నిమ్మాడలో చోటు చేసుకున్న పరిణామాలపై ఇరుపార్టీల మధ్య వార్ ముదురుతోంది. ఇదే క్రమంలో తన అరెస్టు సందర్భంగా అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ టీడీపీలో కలకలం రేపుతోంది.
మళ్లీ తెరపైకి ప్రత్యేక హోదా- అఖిలపక్ష భేటీలో ప్రధానిని కోరిన విజయసాయిరెడ్డి

నిమ్మాడపై వైసీపీ, టీడీపీ వార్
శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అరెస్టు సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజేస్తున్నాయి. ముఖ్యంగా అచ్చెన్నాయుడు అరెస్టును సమర్ధించుకునేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుండగా.. ప్రభుత్వం కక్షసాధింపుగా నిరూపించేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇదే క్రమంలో అచ్చెన్నాయుడు అరెస్టు సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆ పార్టీలో చిచ్చు రేపేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. దీనంతటికీ కారణం తాజాగా సాయిరెడ్డి చేసిన ట్వీటే.

అంతర్గత పరిణామాలపై సాయిరెడ్డి ట్వీట్
నిమ్మాడలో అచ్చెన్నాయుడి అరెస్టు సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి వరంగా మారాయి. ఇప్పుడు ఆ వ్యాఖ్యలను అడ్డుపెట్టుకుని టీడీపీలో చిచ్చురేపేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అచ్చెన్నాయుడికి టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడంపై అసంతృప్తిగా ఉన్న నేతలకు సాయిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు వరంగా మారేలా ఉన్నాయి. ఇంతకీ తన అరెస్టు సందర్భంగా అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏంటో తెలుసా ?

కాబోయే హోంమంత్రిని.. ఖబడ్డార్
నిమ్మాడలో తన సమీప బంధువును నామినేషన్ వేయనీయకుండా అడ్డుకున్నారంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న అచ్చెన్నాయుడును అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లారు. అప్పుడు ఆయన తాను కాబోయే హోంమంత్రిని అంటూ పోలీసులను బెదిరించినట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పోలీసులను బెదిరించేందుకు అచ్చెన్నాయుడు తాను కాబోయే హోంమంత్రి అంటూ బిస్కెట్ వేశారని సాయిరెడ్డి ట్వీట్‌లో ఆరోపించారు.

తన పిచ్చి అందరికీ అంటించిన చంద్రబాబు
అచ్చెన్నాయుడు కాబోయే హోంమంత్రి అని చంద్రబాబు చెవిలో చెప్పి ఉంటారని అంటూ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయినా దాన్ని బయటపెడితే ఎలా అచ్చెన్నా అంటూ సాయిరెడ్డి ప్రశ్నించారు. మరో ఇద్దరు, ముగ్గురు నేతలు కూడా తాము ఏ శాఖల మంత్రులో చెబుతారంట అంటూ సాయిరెడ్డి ఆక్షేపించారు. ఈ క్రమంలో చంద్రబాబు తన పిచ్చిని పార్టీలో అందరికీ అంటించాడు అంటూ సాయిరెడ్డి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.