విశాఖ పోర్టుతో అదానీ గ్రూప్ పేచీ .. ఆ 400 కోట్లు వెనక్కు ఇవ్వాలని ఒత్తిడి !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు పోర్టులన్నింటినీ చేజిక్కించుకుంటున్న గుజరాతీ సంస్థ అదాని గ్రూప్ విశాఖపట్నం పోర్ట్ విషయంలో విశాఖపట్నం పోర్టుపై పెడుతున్న ఒత్తిడి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విశాఖపట్నం పోర్టు లో బీవోటీ విధానంలో ఒక బెర్తు నిర్మాణానికి తాము వెచ్చించిన నాలుగు వందల కోట్ల రూపాయలను వెనక్కి తిరిగి ఇవ్వాలని పోర్టు యాజమాన్యంపై ఒత్తిడి తెస్తోంది . దీనికోసం మధ్యవర్తిత్వం మార్గాన్ని ఎంచుకుంది .

ఆదానీ గ్రూప్ బీఓ టి విధానంలో విశాఖ పోర్టులో 400కోట్లతో ఈ క్యూ 1 బెర్త్ నిర్మాణం
2011లో ఆదానీ గ్రూప్ బీఓ టి విధానంలో విశాఖ పోర్టులో ఈ క్యూ 1 బెర్త్ నిర్మాణానికి ముందుకు వచ్చింది . 30 ఏళ్ల లీజు ఇచ్చే ప్రాతిపదికపై నిర్మాణానికి అంగీకారం కుదుర్చుకుని, వచ్చే ఆదాయంలో 40% వాటా పోర్టుకు ఇవ్వాలని ఒప్పందం చేసుకుంది. సుమారు 400 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి బెర్త్ ను నిర్మించింది . బెర్త్ పై స్టీమ్ కోల్ మాత్రమే నిర్వహించాలని ఒప్పందం చేసుకుంది. బిల్డ్, ఆపరేట్ , ట్రాన్స్ఫర్ విధానంలో నిర్మాణానికి ఒప్పుకున్న ఆదానీ గ్రూప్ ఆ మేరకు నిర్మాణాన్ని 2015 కు పూర్తి చేసి ఆపరేషన్ కు రెడీ అయింది.

ఆపరేషన్స్ కోసం రెడీ అయినా బెర్త్ ప్రభుత్వ నిర్ణయంతో ఉపయోగం లేకుండా
2015 నాటికి నిర్మాణం పూర్తి చేసుకున్న బెర్త్ ఆపరేషన్ కోసం రెడీ అయింది. గంటకు 20 వేల టన్నుల కోల్ ను నిర్వహించగల సామర్థ్యంతో , వంద టన్నుల సామర్థ్యం గల హార్బర్ క్రేన్ సమకూర్చుకుని , ఆపరేషన్ కు రెడీ అయ్యే సరికి దేశంలో బొగ్గు విధానం మారిపోయింది. స్టీమ్ కోల్ విదేశాల నుండి దిగుమతి చేసుకోకూడదని , దేశీయంగానే తవ్వితీసి వినియోగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అదానీ గ్రూపు నిర్మించిన ఈ బెర్తుకు పని లేకుండా పోయింది.

కనీసం లక్ష టన్నుల సరుకును కూడా రవాణా చెయ్యని స్థితి
ఈ బెర్తు నిర్మించిన తరువాత కనీసం లక్ష టన్నుల సరుకును కూడా రవాణా కాని పరిస్థితి. దీంతో పోర్టు యాజమాన్యం గత ఫిబ్రవరిలో టెర్మినేషన్ నోటీస్ ఇచ్చింది.
అయితే 400 కోట్ల రూపాయలను వెచ్చించి బెర్త్ నిర్మించిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బెర్త్ ఉపయోగం లేకుండా పోవడంతో విశాఖపట్నం పోర్టుపై అదాని గ్రూప్ ఒత్తిడి పెంచింది. వ్యాపారం లేనందున, మరో పక్కన కరోనా కారణంగా బెర్త్ నిర్మాణానికి పెట్టిన నాలుగు వందల కోట్ల రూపాయలను వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది.

ఆ 400 కోట్లు వెనక్కు ఇవ్వాలని ఆర్బిట్రేషన్, నిబంధనల ప్రకారం వెళ్ళాలన్న విశాఖపోర్ట్ ట్రస్ట్ చైర్మన్
ఈ క్రమంలో విశాఖ పోర్టుతో ఆర్బిట్రేషన్ మొదలుపెట్టింది. రాజకీయ పలుకుబడితో డబ్బులు వెనక్కి ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి తెస్తోంది.
అయితే పోర్టుతో ఒప్పందం చేసుకున్న సంస్థలకు ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిపై కోర్టుకు వెళ్లొచ్చు అని, కూర్చొని మాట్లాడుకోవచ్చు అని, మధ్యవర్తిత్వం విధానంలో కూడా పరిష్కరించుకోవచ్చని విశాఖపట్నం పోర్టు చైర్మన్ కే రామ్మోహన్ రావు చెబుతున్నారు . ఏదైనా నిబంధన ప్రకారమే జరుగుతుందని అంటున్నారు .

బెర్త్ విషయంలో అదానీ గ్రూప్ ఏం చేస్తుందో ? పోర్టు నిర్ణయం ఏంటో
ఒత్తిడి తెచ్చి ఏదో చెయ్యాలని ప్రయత్నం చేస్తే పోర్టు నష్టపోవాల్సి వస్తుందని ఆయన అంటున్నారు. మరి ఈ వ్యవహారంలో అదాని గ్రూప్ నిరుపయోగంగా మారిన బెర్తు విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుంది . డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్న అదానీ గ్రూప్ పై పోర్టు ఏం చెయ్యబోతుంది అనేది తేలాల్సి ఉంది.