సజ్జల కుమారుడిపై సైబర్ క్రైమ్ కు టీడీపీ నేత వంగలపూడి అనిత ఫిర్యాదు..
విశాఖపట్నం : ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీ, టీడీపీ మధ్య సోషల్ మీడియా వార్ ముదురుతోంది. ఇదే క్రమంలో తాజాగా టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తాజాగా చేసిన వ్యాఖ్యల్ని వైసీపీ వైరల్ చేస్తోంది. తాను అనని వ్యాఖ్యల్ని మార్పింగ్ చేసి ప్రచారం చేయడంపై అనిత మండిపడ్డారు.
వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డి పై టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత ఇవాళ విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సజ్జల కుమారుడు తన వ్యాఖ్యలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబును గద్దె దింపాలని, జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని తాను అనలేదని, ఇలాంటి వ్యాఖ్యలను ఎడిట్ చేయడం దారుణమని అనిత మండిపడ్డారు.

తాను చేశానని చెప్తున్న మార్ఫింగ్ వ్యాఖ్యల్ని మహిళా దినోత్సవం రోజు సాక్షి ఛానల్‌లో కూడా ప్రసారం చేస్తారా అంటూ అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. ఈ విషయంపై తమ నియోజకవర్గం పాయకరావుపేటలో కూడా ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. వైసీపీ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఎవరైనా నిలదీస్తే వారిపై కేసులు పెడతారని, తమపై ఇష్టనుసారంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే ఫిర్యాదు మాత్రం తీసుకోరని మండిపడ్డారు.
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని అనిత ఆరోపించారు. దిశ పీఎస్ పెట్టారని, అసలు దిశ చట్టం ఉందా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి పరదాలు కప్పడానికేనా పోలీసులు ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు అనిత డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications