విశాఖపట్నం, హిందూపురానికి వరాలు
విశాఖపట్నం: ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా మారబోతోన్న సాగర నగరం విశాఖపట్నంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి పునాదిరాయి పడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే ఈ మాల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. దేశీయ పారిశ్రామిక దిగ్గజం కే రహేజా గ్రూప్ దీన్ని నిర్మించబోతోంది. గ్రూప్ ఛైర్మన్ నీల్ రహేజాతో కలిసి జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కైలాసపురం వద్ద 13 ఎకరాల్లో ఈ మాల్ నిర్మితం కాబోతోంది. దక్షిణాది రాష్ట్రాల్లోనే అతిపెద్ద షాపింగ్ మాల్‌గా రూపుదిద్దుకోనుంది. 600 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించబోతోందా సంస్థ. ఈ మాల్ నిర్మాణం వల్ల ఎనిమిది నుంచి 10 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.

భూమిపూజ అనంతరం వైఎస్ జగన్ ప్రసంగించారు. విశాఖపట్నం అభివృద్ధికి ఇది మరింత దోహదపడుతుందని అన్నారు. విశాఖలో ఓ ఆణిముత్యంగా నిలిచిపోయే ప్రాజెక్ట్‌గా అభవర్ణించారు. 13 ఎకరాల్లో మాల్ నిర్మితం కావడం అనేది గొప్ప విషయమని, హైదరాబాద్‌లో ఉన్న ఇనార్బిట్ మాల్ ఎనిమిది ఎకరాల్లో నిర్మించారని పేర్కొన్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లోనే ఇది బిగ్గెస్ట్ మాల్ అవుతుందని జగన్ అన్నారు. ఇనార్బిట్ షాపింగ్ మాల్ నిర్మాణానికి కేటాయించిన స్థలంలోనే రహేజా గ్రూప్ సంస్థల యాజమాన్యం ఫేస్ 2 కింద ఐటీ స్పేస్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తుందని జగన్ వివరించారు. దీనివల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని చెప్పారు.

నీల్ రహేజా మాట్లాడుతూ- శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని హిందూపురం వద్ద 350 ఎకరాల్లో అతిపెద్ద ఇండస్ట్రీయల్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. టెక్స్‌టైల్, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పరిశ్రమలు ఇందులో ఏర్పాటవుతాయని, దీనివల్ల ప్రత్యక్షంగా కనీసం 15,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు.
విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు, తిరుపతిల్లో కూడా ఇనార్బిట్ మాల్ నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని నీల్ రహేజా వివరించారు. దీనికి సంబంధించిన ప్రక్రియను త్వరలోనే మొదలు పెడతామని, ఏపీలో తమ వ్యాపార కార్యకలాపాలను పెద్ద ఎత్తున విస్తరించడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించుకున్నామని అన్నారు.












Click it and Unblock the Notifications